Police Action Social Media Posts :ఆధునిక సమాజంలో మాటలకంటే సెల్ఫోన్ మీటలే ప్రమాదకరంగా మారుతున్నాయి. ఫోన్ చేతిలో ఉంది కదా అని సోషల్ మీడియాలో అవసరం లేకున్నా అనాలోచితంగా అసభ్యకర పోస్టులను, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఆ రోజుకి ఆనందం పొందుతున్నప్పటికీ చివరకు కటకటాలపాలవుతున్నారు. చట్టాలు ఏం చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా పోస్టుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంతో పాటు తప్పుడు పోస్టులు పెడితే ఎలాంటి కేసులు నమోదు చేయవచ్చో తెలుసుకుందాం.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే :నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఓ యువతి ఏపీ ముఖ్యమంత్రి కుటుంబసభ్యులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సదరు యువతి వాడుతున్న ఫేస్‌బుక్ అకౌంట్కు తన సోదరుడి సెల్ఫోన్ నంబరు లింకై ఉండటంతో ఆ రాష్ట్ర పోలీసులు ఇటీవల గ్రామానికొచ్చి అతడిని అరెస్టుచేసి తీసుకెళ్లారు. ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసి, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే ఆలోచనలో ఉన్న ఆ యువకుడి భవిష్యత్తు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.’’
భవిష్యత్ అంధకారం :ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై పాలక, ప్రతిపక్ష పార్టీల సోషల్‌మీడియా టీమ్‌లు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఆ పోస్టులను చూసి స్పందిస్తున్న కొందరు తమ పార్టీ, నాయకుడిపై అభిమానం చాటుకోవాలన్న తపనతో విచక్షణ మరచి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. అనవసర విషయాల్లో తలదూర్చి ఆపద కొనితెచ్చుకుంటున్నారు.
కేసులతో నష్టమిలా :
- చదువులు, ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు వెళ్లేవారు పోలీసుల నుంచి నిరభ్యంతర ధ్రువపత్రాన్ని (ఎన్‌వోసీ) తీసుకోవాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసినప్పుడు హిస్టరీ ప్రొఫైల్ తీస్తారు. ఏవైనా కేసులుంటే ఎన్‌వోసీ ఇవ్వరు.
- ఒక్కసారి కేసు నమోదైందంటే వారిపై పోలీసుల నిఘా ఉంటుంది. దీనివల్ల పిల్లల తల్లిదండ్రులకూ ఇబ్బందే. కేసులు నమోదైతే వారు దొరకనిపక్షంలో కన్నవారిని స్టేషన్‌కు తీసుకొస్తారు.
- సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినా, అసత్య ప్రచారాలు చేసినా లైకులు కొట్టినా అంతే సంగతులు. పోలీసు యంత్రాంగం చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది.
సోషల్ మీడియాలో ఇలా చేయడం నేరం :ఉద్దేశపూర్వకంగానో లేదా దురుద్దేశంతో సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడకూడదు. ఇలాంటి సమాచారాన్ని ప్రజలకు షేర్ చేయవద్దు. జనం మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు చేయకూడదు. క్షణికానందం కోసం రాజకీయ నాయకులు, ప్రత్యర్థులు, విరోధులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే జీవితం అంధకారమవుతుంది.
చట్టాలు, శిక్షలు :భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్), ఐటీ చట్టం, సైబర్ క్రైమ్స్ యాక్ట్ ప్రకారం ఫేక్, మార్ఫింగ్ చిత్రాలు, వీడియోలు వ్యాప్తి చేసి, అవతలి వ్యక్తుల వ్యక్తిత్వ హననానికి పాల్పడినట్లయితే
- 67 ఆఫ్ ఐటీ చట్టం కింద కేసు
- నేరం రుజువైనట్లయితే మూడేళ్ల జైలుశిక్ష
- జరిమానా రూ.5 లక్షలు