Telangana Phone Tapping Case Updates : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాల కోసం దర్యాప్తు బృందం ముమ్మర శోధన చేపట్టింది. ఎస్ఐబీ కార్యాలయంలో లాగర్ రూమ్స్ నుంచి స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ పేరిట ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారో తెలుసుకునేందుకు ఇప్పటికే మూసీ నది నుంచి సేకరించిన హార్డ్ డిస్క్‌లను రిట్రీవ్ చేసే పనిలో ఉన్నారు. దీంతో పాటు ఎవరెవరిని లక్ష్యంగా చేసుకొని ఫోన్లు ట్యాప్ చేశారనే ప్రాథమిక సమాచారాన్ని సేకరించేందుకు ఇది వరకు ఎస్ఐబీ, టాస్క్ ఫోర్స్‌లో పని చేసిన వారితో పాటు మొత్తం 34 మంది నుంచి వాంగ్మూలాలు సేకరించారు.
Phone Tapping Case Investigation :వీటి ఆధారంగా సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సమాచారం రాబట్టనున్నారు. ఓ ప్రముఖ టెలీ కమ్యూనికేషన్ సర్వీస్ కంపెనీకి చెందిన ఉద్యోగిని మచ్చిక చేసుకున్న ప్రణీత్ బృందం, అతడి సహకారంతో విచ్చలవిడిగాట్యాపింగ్‌కు పాల్పడినట్లు దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో అతడిని విచారించడం ద్వారా ట్యాపింగ్ కుట్రకు సంబంధించి కీలక సమాచారం సేకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి స్పష్టమైన ఆధారాలు లభించిన తర్వాతే, ఈ కేసులో ఇండియన్ టెలీగ్రాఫ్ యాక్ట్‌ను చేర్చుతూ న్యాయస్థానంలో మెమో దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దర్యాప్తులో వెలుగులోకి కొత్త విషయాలు :నల్గొండ పోలీసులు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో కలిసి పని చేసిన పలువురు క్షేత్రస్థాయి అధికారులను, సిబ్బందిని విచారించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎస్ఐబీ, వరంగల్, నల్గొండ జిల్లాల్లో పని చేసిన పలువురు పోలీసులను విచారించిన దర్యాప్తు బృందం, నల్గొండ జిల్లాలో పని చేస్తున్న కొందరిని పిలిచి విచారించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు సహా జరిగిన పలు ఉప ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఆరోపణల కోణంలో వీరిని ప్రశ్నించి వివరాలు రాబట్టినట్లు సమాచారం.