తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం - ప్రభాకర్‌రావును రప్పించడానికి మరో అస్త్రం - PHONE TAPPING CASE UPDATE

ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం - మాజీ ఓఎస్టీ ప్రభాకర్‌రావు, అరువుల శ్రవణ్‌ను పట్టుకునేందుకు చర్యలు

investigation into phone tapping case
Phone Tapping Case Update (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 20, 2025, 11:26 AM IST

Phone Tapping Case Update: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావుతో పాటు మరో కీలక నిందితుడు అరువుల శ్రవణ్‌ను పట్టుకునేందుకు పోలీసులు నిమగ్నమయ్యారు. ఈక్రమంలో తాజాగా ఎక్స్‌ట్రడిషన్ (నేరస్థుల అప్పగింత ఒప్పందాన్ని) ప్రయోగించారు. అమెరికాలో తలదాచుకున్న ఆ ఇద్దరిని అప్పగించాలంటూ ఆ దేశ విదేశాంగ శాఖకి సమాచారమిచ్చే ప్రక్రియను ప్రారంభించారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. అమెరికాలో తలదాచుకున్న ప్రభాకర్‌రావు, అరువుల శ్రవణ్‌ను స్వదేశానికి తీసుకువచ్చేలా కసరత్తు చేస్తున్నారు. కరడుగట్టిన నేరస్థులను అప్పగించే విషయంలో అమెరికాతో భారత్‌కు ఒప్పందం ఉన్నందున తాజా ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

ఈక్రమంలోనే సీఐడీ ద్వారా కేంద్ర హోంశాఖకి పోలీసులు నివేదిక పంపించారు. అక్కడి నుంచి విదేశాంగశాఖ ద్వారా అమెరికా ప్రభుత్వానికి ఆ నివేదిక వెళ్లాల్సి ఉంటుంది. అమెరికా ప్రభుత్వం గనక ఆ నివేదికను పరిగణనలోకి తీసుకుంటే నిందితులిద్దరిని భారత్‌కు అప్పగించే అవకాశముంది. ఆ ప్రక్రియకు కొంత సమయం పట్టనున్నా, నిందితులను హైదరాబాద్‌ తీసుకొచ్చేందుకు ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోవద్దనే ఉద్దేశంతో పోలీసులు ఆ దిశగా కసరత్తు చేపట్టినట్లు తెలుస్తోంది.

విచ్చలవిడిగా ఫోన్ అక్రమ ట్యాపింగ్‌ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సెబీ కేంద్రంగా విచ్చలవిడిగా ఫోన్ అక్రమ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో 2023 మార్చి10న కేసు నమోదైంది. ఆ మరుసటి రోజే డీఎస్పీ ప్రణీత్‌రావును అరెస్ట్ చేయడంతో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు దేశం విడిచి వెళ్లిపోయారు. మార్చి 11నే అమెరికాకు వెళ్లిన ప్రభాకర్‌రావు ఇల్లినాయిస్ రాష్ట్రం అరోరాలో ఉంటున్నారు. శ్రవణ్‌రావు మార్చి 15న తొలుత లండన్‌కి వెళ్లి అదే నెల 20న అమెరికా చేరుకున్నారు. ఫ్లోరిడాలోని మియామిలో ఉన్నారు. వారిద్దరిని ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులుగా చేర్చాక వారి కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు.

తెలంగాణ రీజనల్ పాస్‌పోర్ట్ : ఇద్దరు న్యాయస్థానంలో వేర్వేరుగా మెమోలు దాఖలుచేశారు. ప్రభాకర్‌రావు గతేడాది జూన్‌లో వస్తానని పేర్కొన్నారు. వైద్యచికిత్స నిమిత్తం అరోరాలో ఉన్నట్లు వివరించారు. ఆసుపత్రిలోని సోదరి కోలుకున్నాక వస్తానని శ్రవణ్‌ తెలిపారు. రోజులు గడుస్తున్నా ఆ ఇద్దరూ ఇప్పటి వరకు తిరిగిరాలేదు. వారిద్దరి వీసా గడువు ముగియగా పునరుద్ధరణ కోసం తెలంగాణ రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి దరఖాస్తు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఐతే ప్రభాకర్‌రావు అమెరికాలోనే గ్రీన్‌కార్డు పొందినట్లు వెల్లడైంది. కానీ పోలీసులు మాత్రం ఆ విషయమై అధికారిక సమాచారం రాలేదని చెబుతున్నారు.

శ్రవణ్‌రావు వీసా గడువు ముగిసినా అమెరికాలో అక్రమ వలసదారుగా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. వారిద్దరిని హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు గతంలోనే రెడ్‌కార్నర్ నోటీస్‌ జారీకి కసరత్తు చేశారు. కేంద్ర విదేశాంగశాఖ ద్వారా ఇంటర్‌ పోల్‌కు సమాచారం పంపారు. ఐతే ఆ విషయమై విదేశాంగ శాఖలో అప్పీల్‌ చేశారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతుండగానే తాజాగా ఎక్స్‌ట్రడిషన్‌ ప్రక్రియను ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది.

ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్​ రావును వెనక్కి తీసుకురావడం ఎలా? - అమెరికాలో గ్రీన్‌కార్డుతో పోలీసులపై ఒత్తిడి!

నేనిచ్చిన ఫోన్‌నంబర్లను ట్యాపింగ్‌ చేస్తున్న సంగతి తెలియదు : జైపాల్ యాదవ్

ABOUT THE AUTHOR

...view details