Petrol Pump Scams :పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇటీవల సిద్ధిపేటలోనూ ఓ పెట్రోల్ బంకులో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. కానీ బయటకు రాని ఎన్నో మోసాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలను గుర్తించడం ఎలా? వీటి నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జంప్ ట్రిక్ ఎలా పనిచేస్తుంది?
పెట్రోల్ బంక్‌కు వెళ్లాక మీటర్ గమనిస్తే రీడింగ్ (0) సున్నా చేస్తారు. అది మనకు కనిపిస్తుంది. పెట్రోల్ నింపడం ప్రారంభించగానే.. అంతా బాగానే ఉంది అని వినియోగదారులు లైట్ తీసుకుంటారు. అప్పుడే మోసాలకు పాల్పడతారని నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్ కొట్టడం ప్రారంభించగానే 1,2,3 రీడింగ్ కనిపించకుండా నేరుగా 5,6,7,8 కు జంప్ అవుతుందట. ఇలా చేయడం వల్ల మీకు రావాల్సిన పెట్రోల్ కన్నా తక్కువగా వస్తుందని అంటున్నారు. అందుకే జాగ్రత్తగా రీడింగ్ గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.
షార్ట్ ఫ్యూయలింగ్
పెట్రోల్ బంక్ వాళ్లు చేసే మోసాల్లో షార్ట్ ఫ్యూయలింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని సింపుల్‌గా చెప్పాలంటే, మిమ్మల్ని మాటల్లో పెట్టి తక్కువ ఇంధనం నింపి, ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుంటారు. ఉదాహరణకు మీరు రూ.100 విలువైన పెట్రోల్ అడిగినప్పుడు.. అటెండెంట్ మీటర్‌ను జీరోకు సెట్ చేసి, ఫ్యూయెల్ నింపాల్సి ఉంటుంది. కానీ అతడు అంతకుమందు కొట్టిన రూ.50 రీడింగ్ వద్ద నుంచి ప్రారంభిస్తాడు. అప్పుడు మీరు రూ.100 చెల్లించి, కేవలం రూ.50 విలువైన ఇంధనాన్ని మాత్రమే పొందుతారు. ఇలా కాకుండా ఉండాలంటే ఇంధనం నింపే సమయంలో కచ్చితంగా మీటర్ జీరోకు సెట్ చేసిన తరువాత మాత్రమే పెట్రోల్ లేదా డీజిల్‌ను నింపించుకోవాలి.
కార్ దిగి పెట్రోల్ కొట్టించుకోవాలి
కార్లలో ప్యూయల్ ఫిల్ చేసుకునే చాలా మంది వాహనం కిందకు దిగరు. లోపల నుంచి డబ్బులు చెల్లించి కొట్టించుకుంటారు. ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని మీటర్ రీడింగ్ మార్చకుండానే ఫిల్ చేస్తుంటారని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎప్పుడు పెట్రోల్ కొట్టించినా కారు దిగి మీటర్ దగ్గరు వెళ్లి పోయించుకోవాలని సూచిస్తున్నారు.
మెషీన్ మధ్యలో ఆగకూడదు
పెట్రోల్ పోసే వ్యక్తి మెషీన్‌ను తరచుగా నిలిపివేస్తుంటే మోసం చేస్తున్నట్లుగానే భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల పెట్రోల్ తక్కువగా వస్తుందని అంటున్నారు. ఇలా అనుమానం వచ్చిన సమయంలో అవసరమైతే పెట్రోల్‌ను పరీక్షించమని బంక్ యజమానులను డిమాండ్ చేయాలని సూచిస్తున్నారు. ఇవే కాకుండా పెట్రోల్ మెషీన్ వేగంగా పనిచేస్తున్నా, పెట్రోల్ తక్కువగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
రౌండ్ ఫిగర్ వద్దు
మనలో చాలా మంది రూ.100, 200, 500, 1000 ఇలా రౌండ్ ఫిగర్‌గా పెట్రోల్‌ను కొట్టిస్తుంటారు. ఇలా పోయించుకోవడం వల్ల సులభంగా మోసం చేస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందుగానే పెట్రోల్ మెషీన్లో చిప్స్‌తో సెట్టింగ్ చేసి ఇంధనం తక్కువగా వచ్చేలా చేస్తారని వివరించారు. కాబట్టి వీలైనంత వరకు రౌండ్ ఫిగర్‌గా పెట్రోల్ కొట్టించుకోకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు.