Management Seats Sale Prevention In Btech : ఇంజినీరింగ్‌లో బీ కేటగిరీ(మేనేజ్మెంట్) సీట్ల అమ్మకాలను అడ్డుకునేందుకు శాశ్వత విధానాన్ని రూపొందించే దిశగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఈ దందాపై ఏటా విద్యార్థి, ప్రజాసంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అత్యధిక సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం చూపితే తమ వైపు వేలెత్తి చూపేవారే ఉండరని, మరోవైపు తల్లిదండ్రులకు ప్రయోజనం కలుగుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వచ్చే అకాడమిక్ ఇయర్ (2025-26)లో ఈ వ్యవహారంపై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చేయాలనే పట్టుదలతో ఉన్న ఉన్నత విద్యామండలి నూతన ఛైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి ఆ దిశగా కసరత్తును ముమ్మరం చేశారు.
నిబంధనలకు భిన్నంగా :రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో 70 శాతం బీటెక్ సీట్లను ప్రభుత్వమే మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా వెబ్ కౌన్సెలింగ్ విధానంలో భర్తీ చేస్తోంది. మిగిలిన 30 శాతాన్ని బీ కేటగిరీ లేదా మేనేజ్మెంట్ కోటా కింద ఆయా కళాశాలలే భర్తీ చేసుకుంటాయి. నిబంధనల ప్రకారం ఈ విభాగం సీట్లను జేఈఈ మెయిన్/ ఎప్‌సెట్ ర్యాంకు/ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగా భర్తీ చేయాల్సి ఉంటుంది. వాటికి కూడా ప్రభుత్వం నిర్దేశించిన కన్వీనర్ కోటా రుసుమును మాత్రమే వసూలు చేయాలి. కానీ అందుకు భిన్నంగా మెరిట్‌ను పట్టించుకోకుండా, ఎక్కువ చెల్లించేందుకు ఎవరు ముందుకొస్తే వారికే యాజమాన్యాలు అమ్ముకుంటున్నట్టుగా ఆరోపణలున్నాయి.
ఏటా రూ.కోట్ల రూపాయల వసూళ్లు దందా :రాష్ట్రంలో 150 వరకు ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా, ఆయా మేనేజ్మెంట్ గిరాకీ ఉన్న సీఎస్‌ఈ తదితర బ్రాంచీల్లో ఒక్కో సీటును రూ.8 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు అమ్ముకుంటున్నట్టుగా సర్కారు వద్ద సమాచారం ఉంది. ఎన్‌ఆర్‌ఐ కోటా సీటుకు గరిష్ఠంగా ఏడాదికి 5 వేల అమెరికన్ డాలర్లు వసూలు చేసుకునే వెసులుబాటు ఉండగా అంతకు రెట్టింపు తీసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి మేనేజ్మెంట్ కోటా కింద ప్రతి సంవత్సరం 20 వేలకుపైగా సీట్లు భర్తీ అవుతున్నాయి.