People Suffering From Floods : వరదలు వచ్చాయంటే ఆ ప్రాంతాలు ఓ వైపు శబరి నది, మరోవైపు గోదావరి నదుల ప్రవాహంతో ముంపునకు గురవుతున్నాయి. గోదావరి, శబరి నదులకు సంభవించిన వరదలు తగ్గినట్లే తగ్గి వరదతో మళ్లీ ఉగ్రరూపం దాల్చుతున్నాయి. దీంతో అల్లూరి జిల్లా శివారు చింతూరు డివిజన్లో కూనవరం, వీఆర్పురం మండలాలు నీట మునిగడంతో గ్రామస్థులను పునరావాస కేంద్రాలకు తరలించారు. రెండు రోజుల క్రితం జాతీయ రహదారిపై రాకపోకలు ప్రారంభం కాగా వరద నీరు ముంచెత్తడంతో మళ్లీ రాకపోకలు నిలిచిపోయాయి. వారం రోజులుగా విలీన మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
వరదలో మునిగిపోయిన ఇళ్లు: వర్షాలు తగ్గుముఖం పట్టిన వరద నీటితో కూనవరం మొత్తం నీట మునిగింది. గ్రామస్థులు పునరావాస కేంద్రాలకు తరలిపోయారు. వీఆర్పురం - కూనవరం మధ్య ఉన్న శబరి నది వంతెన మునిగిపోయింది. ప్రస్తుతం గ్రామస్థులు కూనవరం వీధుల్లో పడవ ప్రయాణం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్, బస్టాండ్లోని ప్రయాణికుల షెల్టర్తోపాటు ఇళ్లు మొత్తం మునిగిపోయాయి. వీధుల్లో పడవల్లో ప్రయాణించాల్సి వస్తుందని శాశ్వత పరిష్కారం చూపాలని అక్కడి ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
చింతూరు- వరరామచంద్రపురం మండలాల మధ్య చీకటి వాగు, సోకులేరు వద్ద ప్రధాన రహదారులపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య రాకపోకలు జరగడం లేదు. ముకునూరు, ఏజీకొడేరు, పెదశీతనపల్లి పంచాయతీల పరిధిలో సుమారు 50 గ్రామాలకు పైగా మండల కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. శబరి నది వరదలతో చింతూరు వచ్చే ప్రధాన రహదారిపై వరద చేరుకుంది. ఈ రహదారిలోని పలు దుకాణ సముదాయాలు వరదలో మునిగిపోయాయి.