Godavari Floods in AP 2024 : ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి వరద పోటెత్తుతోంది. రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు సోమవారం అర్ధరాత్రి 2 గంటలకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం నీటిమట్టం 14.20 అడుగులకు చేరుకుంది. ఈ క్రమంలోనే అధికారులు సముద్రంలోకి 13.30 లక్షల క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు.
నీటిలోనే లంక గ్రామాలు :మరోవైపు కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉద్ధృతితో లంక గ్రామాలు నీటిలోనే మగ్గుతున్నాయి. పడవలపైనే లంకవాసుల రాకపోకలుసాగిస్తున్నారు. కాజ్‌వేలు, ఉద్యానవన పంటలు మునిగిపోయాయి. నివాస గృహాలకు వరద చేరడంతో జనం బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. ముమ్మిడివరం మండలంలో గురజాపు లంక, కూనాలంక, లంకాఫ్ ఠానేలంక గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి ముంపునకు గురైంది.
ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితుల విజ్ఞప్తి :అయినవిల్లి లంక వద్ద ఎదురుబిడియం కాజ్వే పైకి వరద నీరు చేరి వాహనదారులకు ఇబ్బందిగా మారింది. అయినవిల్లి లంక, అద్దంకివారి లంక, వీరవెల్లిపాలెం, పల్లపు లంక ప్రజలు మోకాళ్ల లోతు నీటిలో నడుస్తూ ప్రయాణాలు సాగిస్తున్నారు. వరద ఉద్ధృతి అంతకంకతకూ పెరుగుతుండటంతో పశువులను సురక్షిత ప్రాంతాలకు రైతులు తరలిస్తున్నారు. వందలాది ఎకరాల్లో కూరగాయల పంటలు నీట మునిగాయి. అక్కడక్కడ మిగిలిన కాయలను అన్నదాతలు కోసుకుంటున్నారు. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించి, ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.