People not Complaining on Fraudsters :చోరీలు, అత్యాచారాలు, మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు పోలీసులు కొత్త సవాల్ విసురుతున్నారు. ఎన్నో దారుణాలకు పాల్పడుతూ దర్జాగా తిరుగుతున్నారు. దారుణాలకు పాల్పడిన వాళ్లు ఎవరో అని తెలిసినా పక్కా ఆధారాలున్నా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. వారి గుట్టు కూడా బయటపడుతుందనే గుబులు ఒకటైతే పరువు పోతుందనే భయంతోనే మౌనం ఉంటున్నారు.
సొమ్ములు పోయినా గప్‌చుప్
- నగరంలోని రాచకొండ పరిధిలో ఇటీవల ఓ పాలవ్యాపారి ఇంట్లో రూ.2 కోట్లు చోరీకి గురైంది. పోలీసులకు దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేస్తే డబ్బు వివరాలు బయటపడతాయన్న కారణంతో 15 లక్షల రూపాయలు పోయినట్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల నుంచి రూ.85 లక్షలు స్వాధీనం చేసుకున్నారు, కరడుగట్టిన దొంగను అరెస్టుచేశారు.
- సికింద్రాబాద్‌లోని ఓ బంగారు దుకాణంలో రూ. 1.5 కోట్లు విలువైన నగలు చోరీకి గురయ్యాయి. దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్మగ్లింగ్ దందా బయటపడుతుందని యజమాని భావించారు.
- నగర శివారులోని ఓ ప్రముఖుని నివాసంలో బంగారు, వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. ఆయన మౌఖిక ఆదేశాలతో సొమ్ము రికవరీ చేయించుకున్నారు. దొంగలు పట్టుబడినా కేసు నమోదు చేయకపోడంతో పోలీసులు వారని హెచ్చరించి వదలేసినట్లు సమాచారం.
- అందమైన అమ్మాయిల మెసేజ్‌లకు, వీడియోకాల్స్‌కు ఆకర్షితులై వలపువలలో చిక్కి కొందరు రూ. లక్షలు నష్టపోతున్నారు. అయినా బాధితుల్లో కేవలం 5 శాతం మంది మాత్రమే ఫిర్యాదు చేస్తున్నట్లు సైబర్‌క్రైం పోలీసులు చెప్పారు.
- గొలుసుకట్టు, సైబర్ మోసాల్లోనూ రూ.10 వేల లోపు నష్టపోతున్న బాధితులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేయడంలేదు. పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోందన్న అభిప్రాయంతో మౌనంగా ఉంటున్నారు.