People Impressed for Food Business Expo in Vijayawada : ఆహార ప్రియులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అభిరుచికి విజయవాడలో నిర్వహించిన 'ఫుడ్ బిజినెస్ ఎక్స్ పో' అద్దం పట్టింది. వివిధ రకాల ఆహార పదార్థాలతో పాటు వంటగది, వ్యాపారపరంగా వినియోగించే వస్తు సామగ్రిని ప్రదర్శనలో ఉంచారు. ఆహార వస్తువులే కాకుండా ఫర్నిఛర్, లైఫ్ స్టైల్ కు సంబంధించి పలురకాల వస్తువులు ప్రదర్శనలో కొలువు దీరాయి.
ఆకట్టుకుంటున్న ఫుడ్ బిజినెస్ ఎక్స్పో :విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ హాలులో మూడు రోజులుగా జరిగిన ఫుడ్ బిజినెస్ ఎక్స్ పో అందరినీ ఆకట్టుకుంది. వివిధ రకాల ఆహార పదార్థాలు స్టాళ్లలో కొలువు దీరాయి. గృహిణులు ఇళ్లల్లో వినియోగించే హోంనీడ్స్, ఇతర అలంకరణ సామగ్రిని ప్రదర్శనలో ఉంచారు. జీడిపప్పుతో తయారుచేసే వివిధ రకాల ఆహార పదార్థాలను ప్రదర్శనలో ఉంచారు. ఆఫ్రికా నుంచి దిగుమతి చేసిన జీడిపప్పును స్పైసీగా వివిధ రకాల రుచుల్లో వీటిని అందిస్తున్నారు. చిన్న చిన్న హోటళ్లు నిర్వహించాలనుకునేవారి కోసం వంటపాత్రలు, తయారీ పాత్రలు, చాట్ కౌంటర్, కర్రీ కౌంటర్ లను ప్రదర్శించారు.
రకరకాల ఆహార పదార్ధాలు, ఫర్నీచర్, హోంనీడ్స్:కాఫీ సొల్యూషన్ పేరుతో వివిధ రకాల కాఫీలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేలా పలురకాల మోడళ్లను అందుబాటులో ఉంచారు. ఒక్కో యూనిట్ 50వేల రూపాయల నుంచి 17 లక్షల రూపాయల వరకు ధర పలుకుతుంది. నచ్చిన ఆకారంలో ఐస్ క్రీములు తయారుచేసే మిషన్లు, చెరకురసం పిండే యంత్రాలు, సోడా, స్వీట్ కార్న్ మిషన్లు, 3 నిమిషాల్లో ఈజీగా కప్ పిజ్జా తయారయ్యే యంత్రాలు సందర్శకుల్ని ఆకట్టుకున్నాయి. నూనెతో కాకుండా కేవలం వేడిమి ద్వారా స్నాక్స్ ను తయారుచేసే మిషన్లు ప్రదర్శనలో ఆహార ప్రియుల్ని ఆకట్టుకున్నాయి. అటు ఆరోగ్యంతోపాటు ఇటు సులువుగా స్నాక్స్ ను తయారుచేసుకోవడానికి ఇవి ఉపయోగడపడతాయని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆరోగ్యంపై అందరికీ అవగాహన పెరిగింది. నాన్ వెజ్ కాకుండా వెజ్ పదార్థాలపై దృష్టి సారిస్తున్నారు. ఇలాంటివారికోసం నాన్ వెజ్ కు బదులుగా వచ్చిన వెజ్ చికెన్, వెజ్ మటన్లను ప్రదర్శలో ఉంచారు. మష్రూమ్ బాల్స్, సోయా బాల్స్ తో తయారుచేసిన ఈ వంటకాలు ఆహార ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.