Road Accident : వారంతా హైదరాబాద్ నుంచి దాదాపు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాకు వెళ్లారు. అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి ఇంటికి వెనుదిరిగారు. కానీ మార్గమధ్యలోనే మృత్యువు లారీ రూపంలో వారిని కబళించింది.
ఉదయం 8 గంటలు. మధ్యప్రదేశ్ జబల్‌పుర్‌లోని సిహోరా ప్రాంతం. హైవే వంతెనపైకి రాంగ్‌రూటులో వచ్చిన సిమెంట్ లోడ్ లారీ ఎదురుగా వస్తున్న మినీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో మినీ బస్సు తుక్కుతుక్కుగా మారి ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు దాంట్లో ఇరుక్కుపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రుల్ని రక్షించి సిహోరా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. మృతి చెందిన వారంతా ఏపీ వాసులుగా తొలుత భావించినా మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో హైదరాబాద్ నాచారంలోని రాఘవేంద్రనగర్ వాసులుగా గుర్తించారు.
ప్రమాదంలో నాచారానికి చెందిన శశికాంత్, మల్లారెడ్డి, రవిప్రకాశ్, సంతోష్‌కుమార్, డ్రైవర్ రాజుతో పాటు దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ఆనంద్, తార్నాక వాసి టీవీప్రసాద్ అనే ఈ ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరోకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనతో నాచారంలోని బాధితులు ఇళ్ల వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రయాణికులు క్షేమం :ఘటనా సమయంలో మినీ బస్సు వెనుకగా వచ్చిన తెలంగాణకు సంబంధించిన కారు సైతం ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తూ కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో అందులోని ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదానికి గురైన కారు వనపర్తి జిల్లా చిన్నమందడి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సూర్యచంద్రారెడ్డిదిగా గుర్తించారు. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సూర్యచంద్రారెడ్డి చేయి విరగ్గా అందులో ఉన్న మరో ముగ్గురికి స్పల్ప గాయాలయ్యాయి.