తెలంగాణ

telangana

ETV Bharat / state

బెంబేలెత్తిస్తోన్న చలి పులి - గత మూడ్రోజులుగా గజగజ వణుకుతున్న జనం - INCREASED COLD IN TELANGANA

రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న చలి తీవ్రత - చలితో గజగజమంటున్న ప్రజలు - పిల్లలూ, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్న వైద్యులు

COLD INTENSITY IN TELANGANA
Increased cold intensity in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Increased cold intensity in Telangana :రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులతో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోతున్నాయి. బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. చలి నుంచి రక్షణ పొందేందుకు ఉన్నివస్త్రాలు కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చలి పులి బేంబెలెత్తిస్తోంది. రెండు మూడు రోజుల నుంచి చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్‌, మెదక్‌ జిల్లా సహా పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోనూ నాలుగు రోజుల నుంచి చలి తీవ్రత అంతకంతకూ పెరిగింది. 11 నుంచి 12 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి నుంచి రక్షణ పొందేందుకు ఉన్ని వస్త్రాలు వినియోగిస్తూ జనం ఉపశమనం పొందుతున్నారు.

చలితీవ్రతకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వణికిపోతోంది. నాలుగురోజుల కిందట 15 డిగ్రీలపైబడి నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు తాజాగా 5.2 డిగ్రీలకు పడిపోవటంతో జనం గజగజ వణకాల్సి వస్తోంది. జైనథ్‌, భోరజ్‌, సోనాల, తాంసి, తలమడుగు, ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లా తాండ్ర, మంచిర్యాల జిల్లా కాసిపేట ప్రాంతాల్లో 6 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో వైపు ఇదే ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్దపులులతోనూ జనం భయాందోళనలకు గురవుతున్నారు. అటు చలితో ఇటు పులితో జనం గజగజమంటున్నారు.

'గత నాలుగు రోజుల నుంచి విపరీతమైన చలి ఉంది. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం చలి మంట లేనిది ఉండలేకపోతున్నాం. కచ్చితంగా ఉన్ని దుస్తులు ధరించాల్సిన పరిస్థితి ఉంది. ఈ మూడు రోజుల నుంచి చలి పెరగడంతో బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. చల్ల గాలి రావడంతో పాటు చలి విపరీతంగా పెరిగింది. అత్యవసరమైతేనే బయటకు వెళ్తున్నాం' -ప్రజలు

సంగారెడ్డి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ : ఉమ్మడి మెదక్ జిల్లాలో రాత్రిళ్లు చలి మంటలు వేసుకుంటున్నారు. ఉదయం పూట పొగ దట్టంగా కమ్ముకుంటోంది. రాత్రే కాదు మిట్ట మధ్యాహ్నం శీతల గాలులు వీస్తున్నాయి. జహీరాబాద్ ప్రాంతంలోని సత్వార్, కోహిర్, న్యాల్ కల్‌లో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. చలి తీవ్రత కారణంగా వాతావరణ శాఖ సంగారెడ్డి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతేనే బయటకు వెళ్తున్నామని ప్రజలు చెబుతున్నారు. చలి తీవ్రత నేపథ్యంతో పిల్లలూ, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

తెలంగాణ గజగజ! : ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు - సింగిల్ డిజిట్​తో జనం బెంబేలు

ABOUT THE AUTHOR

...view details