తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రచారాస్త్రాలుగానే మిగిలిపోతున్న రైల్వే ప్రాజెక్టులు - సరైన రవాణా మార్గాలు లేక ఊమ్మడి పాలమూరు జిల్లా వెనకబాటు - Pending Railway Projects In MBNR - PENDING RAILWAY PROJECTS IN MBNR

Pending Railway Projects In Mahbubnagar : సులభతరమైన రవాణా మార్గాలుంటే ప్రగతి దానంతటదే పట్టాలెక్కుతుంది. పరిశ్రమలు, వాణిజ్యం, వ్యవసాయం, పర్యాటకం, విద్య, వైద్యం, ఉపాధి సహా అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులొస్తాయి. కానీ, అలాంటి రవాణా మార్గాలు లేకపోవడంతో ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా వెనకబాటునకు గురవుతోంది. అన్ని రకాల అవకాశాలున్నా, సరైన రైల్వే సౌకర్యాల్లేక పాలమూరు జిల్లా అభివృద్ధికి నోచుకోలేకపోతుంది. ఉమ్మడి జిల్లాలోని నాగర్​ కర్నూల్ జిల్లాకు అసలు రైలు సౌకర్యమే లేదు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడల్లా రైల్వే ప్రాజెక్టులు రాజకీయ పార్టీలకు ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయే తప్ప, కార్యరూపం దాల్చడం లేదు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న రైల్వే ప్రాజెక్టులు, ప్రస్తుత ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక కథనం.

Pending Railway Projects In Mahbubnagar
Pending Railway Projects In Mahbubnagar

By ETV Bharat Telangana Team

Published : Apr 11, 2024, 9:41 PM IST

రైళ్ల రాక అభివృద్ధి కరవు- ఇకనైనా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముఖచిత్రం మారేనా!

Pending Railway Projects In Mahbubnagar :లోక్​సభ ఎన్నికలు వస్తే చాలు రాజకీయ పార్టీలకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రైల్వే ప్రాజెక్టులు (pending Railway Projects) ప్రచారాస్త్రాలుగానే మారుతున్నాయి. తమను ఎంపీగా గెలిపిస్తే ప్రస్తుతం నడుస్తున్న రైల్వే పనుల్ని వేగవంతం చేస్తామని, ఏళ్లుగా ప్రారంభం కాని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు. కానీ, అధికారంలోకి వచ్చాక ఆశించిన మేర పనులు జరగడం లేదు. అటు ఉమ్మడి జిల్లాలో రైల్వేకు సంబంధించి ఎన్నో డిమాండ్లు ఉన్నా ఏళ్లుగా నెరవేరడం లేదు. వికారాబాద్-కృష్ణా, గద్వాల- మాచర్ల, జడ్చర్ల- నంద్యాల రైల్వే లైన్లు సహా విద్యుదీకరణ, డబ్లింగ్, రైల్వేస్టేషన్ల ఆధునీకరణ, కొత్తరైళ్ల ప్రతిపాదనలు అమలుకు నోచుకోకపోగా కొన్ని మంజూరైనా నత్తనడకన సాగుతున్నాయి.

Vikarabad-Krishna Railway Line work pending :ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న డిమాండ్ వికారాబాద్-కృష్ణా రైల్వేలైన్. 1988లో నారాయణపేట జిల్లా కృష్ణా నుంచి వికారాబాద్​కు 87కిలోమీటర్ల మేర రూ.90కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు చేశారు. ఈ పనుల కోసం సర్వే చేసినా కాగితాలకే పరిమితమయ్యా యి. 2010లో మరోసారి సర్వే జరిగింది. 2012లో 2రకాల అభిప్రాయాలతో రైల్వేబోర్డుకు సర్వే నివేదిక అందింది. ఆ నివేదికలోని మొదటి అభిప్రాయాన్ని రైల్వేబోర్డు(Railway Board) పరిగణనలోకి తీసుకుంది. 121కిలోమీటర్ల రైల్వే లైన్ను రూ.787 కోట్ల రూపాయలతో చేపట్టాలని భావించింది. రేట్ ఆఫ్ రిటర్న్స్​(ఆఓఆర్) 14శాతానికి రావాలంటే ప్రాజెక్టు వ్యయంలో 58% రాష్ట్ర ప్రభుత్వం భరించాలని రైల్వేబోర్డు సూచించింది.

నాటి ప్రభుత్వం రైల్వే మార్గంలో మార్పులు చేర్పులు చేస్తూ మరోసారి సర్వే చేయాలని కోరింది. ఆ విజ్ఞప్తుల్ని పరిగణలోకి తీసుకున్న రైల్వేబోర్డు మళ్లీ సర్వే నిర్వహించింది. గతేడాది రైల్వే మంత్రిత్వ శాఖ(Railway Ministry)రూ.50వేల కోట్ల అంచనా వ్యయంతో 2647 కి.మీ మేర 15 నూతన రైల్వే లైన్ల కోసం ఫైనల్ లొకేషన్ సర్వేకు అనుమతులు మంజూరు చేసింది. అందులో ముఖ్యమైనది వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్. సుమారు 122 కి.మీ ఉండే ఈ రైల్వే లైన్ అంచనా వ్యయం రూ.2196కోట్లు.

కొత్త ప్రాంతాలకు రైలు సౌకర్యం :వికారాబాద్-కృష్ణా రైలు మార్గం ద్వారా దక్షిణ తెలంగాణలోని కొత్త ప్రాంతాలకు రైలు సౌకర్యం కల్పించే అవకాశం ఉంది. వికారాబాద్ నుంచి పరిగి, కొడంగల్, హుస్నాబాద్, దౌల్తాబాద్, మక్తల్, నారాయణపేటలను కలుపుతూ ఈ మార్గం కొనసాగనుంది. దీంతో ఆయా పట్టణాల నుంచి హైదరాబాద్కు ప్రయాణం సులభతరం కావడంతో పాటు.. తాండూరు నుంచి సిమెంట్ పరిశ్రమ లకు సరుకు రవాణాకు మార్గం సుగమం కానుంది. ఈ మార్గం పూర్తైతే వికారా బాద్ నుంచి హూబ్లి, కొల్హాపూర్, గోవాకు దగ్గరి మార్గం కానుంది.

Railway Projects delays in Mahbubnagar : ఉమ్మడి జిల్లాలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మరో డిమాండ్ గద్వాల- మాచర్ల రైల్వే లైన్. 1992లో గద్వాల నుంచి మాచర్ల వరకు రూ.190కోట్లతో 220కిలోమీటర్ల మేర కొత్త లైను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపారు. 2007-08లో మళ్లీ ప్రతిపాదించారు. 2010లో రూ.919కోట్ల అంచనా వ్యయంతో 3రకాలుగా ఈ ప్రాజెక్టును చేపట్టవచ్చనే సర్వేనివేదిక రైల్వేబోర్డుకు చేరింది. కానీ, తర్వాత గద్వాల-మాచర్ల రైల్వేలైన్ ప్రస్తావనే లేకుండా పోయింది. తాజాగా రైల్వేశాఖ గద్వాల-డోర్నకల్ మధ్య నూతన రైల్వేలైన్కు తుది స్థాన సర్వేకు శ్రీకారం చుట్టింది. దీంతో గద్వాల-మాచర్ల రైల్వేలైన్​కు తిరిగి మోక్షం కలిగినట్లైంది.

గద్వాల- డోర్నకల్​ రైల్వే లైన్​కు రూ.7.40 కోట్ల కేటాయింపు :గద్వాల నుంచి డోర్నకల్​ వరకు 296 కిలో మీటర్ల మేర సర్వే కొనసాగుతోంది. అందుకోసం 7.40 కోట్లు కేటాయించారు. పాత డిజైన్ ప్రకారం గద్వాల నుంచి వనపర్తి, నాగర్కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, దేవరకొండ మీదుగా మాచర్ల వరకు రైల్వే లైను ప్రతిపాదనలున్నాయి. ప్రస్తుతం ఆ ఆకృతి మారింది. గద్వాల నుంచి వనపర్తి, నాగర్కర్నూల్, కల్వకుర్తి, దేవరకొండ, నల్గొండ, సూర్యాపేట మీదుగా డోర్నకల్వరకు కొత్త రైల్వే లైనుకు సర్వే చేస్తున్నారు. ఇది కార్యరూపం దాలిస్తే దక్షిణ తెలంగాణకు కీలకమవుతుంది. సిమెంట్, గ్రానైట్​ పరిశ్రమలు అధికంగా ఉన్న ప్రతిపాదిత మార్గాన్ని క్షుణ్నంగా పరిశీలించి, మార్కింగ్​ వేస్తున్నారు.

గద్వాల-డోర్నకల్​ రైల్వే లైన్ సర్వే పనులు నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో జరుగుతున్నాయి. సర్వే పనులు డోర్నకల్నుంచి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్​గూడెం మీదుగా మోతె మండలంలోని కొత్తగూడెం గుండా సాగుతున్నాయి. కొత్తగూడెం, తుమ్మలపల్లి తదితర గ్రామాల వద్ద రహదారి పాసింగ్లను గుర్తించి సర్వే బృందం మార్కింగ్లు చేశారు. 2025 ఫిబ్రవరి లో బడ్జెట్​ నాటికి తుది సర్వే పూర్తై ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అధికారులు భావిస్తున్నారు. రూ.5330కోట్లతో రైల్వేశాఖ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. ఈ రైల్వే మార్గంతో(Railway line) తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్, దిల్లీకి ప్రయాణం సులభతరమవుతుంది.ఈ ప్రాంతంలో సామాజిక, ఆర్థిక, వ్యవసాయ, వ్యాపార, విద్య, పర్యాటక, వైద్యరంగాల్లో రవాణా అవసరాలను తీర్చుతుందని రైల్వేశాఖ అంచనా వేస్తుంది.

Lack Of Railwayline In Nagar kurnool :పాలమూరుకు వికారాబాద్ -కృష్ణా, గద్వాల- డోర్నకల్ నూతన రైల్వేలైన్లు వస్తే వాణిజ్యం, రవాణా పరంగా ఎంతో లబ్ధి కల్గుతుంది. మహబూబ్​నగర్​, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లోనే ప్రస్తుతం రైల్వేసౌకర్యం ఉంది. నాగర్​కర్నూల్ జిల్లాలో రైల్వే లైనే లేదు. డోర్నకల్ రైల్వే లైను వస్తే నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రంతో కల్వకుర్తి, ఇతర గ్రామాల్లో రైల్వే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. పూర్వ నల్గొండ, వరంగల్​ జిల్లాల మధ్య రవాణా సేవలు విస్తరిస్తాయి. వాణిజ్యం(Commerce) మరింత పుంజుకుంటుంది. రవాణా వ్యవస్థ సరిగ్గా లేక నారాయణపేట జిల్లాకు పరిశ్రమలు రావడం లేదు. వికారాబాద్​ కృష్ణా రైల్వే లైను ఏర్పాటైతే వెనకబడిన నారాయణపేట జిల్లా అభివృద్ధికి బాటలు పడతాయి.

మరుగున పడిన జడ్చర్ల-నంద్యాల రైల్వే మార్గం : జడ్చర్ల-నంద్యాల రైల్వే మార్గాన్ని 2005-2006లో ప్రతిపాదించారు. 2007లో 565 కోట్ల అంచనా వ్యయం అవుతుందని సర్వే నివేదిక రైల్వే బోర్డుకు చేరింది. కానీ, 2008 నుంచి దాని ప్రస్తావన లేకుండా పోయింది. ఇవి కాకుండా జడ్చర్ల-మిర్యాల గూడ, అచ్చంపేట-మహబూబ్​నగర్ రైల్వే లైను కోసమూ పాలమూరు ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి ఈ రైల్వే లైన్ల ప్రతిపాదనలు, సర్వేలను రైల్వేశాఖ(Railway ministry) పక్కకు పెట్టినట్లు సమాచారం.

గత పదేళ్లలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉందానగర్ నుంచి మహబూబ్​నగర్ వరకూ విద్యుదీకరణ సహా డబ్లింగ్ పూర్తైంది. ముద్కేఢ్ నుంచి డోన్ వరకూ డబ్లింగ్కు గతేడాది కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేయడంతో మహబూబ్నగర్ నుంచి డోన్ వరకూ రైలు రవాణా సేవలు మరింత సులభతరం కానున్నాయి. రూ.4,686కోట్లతో 417 కి.మీ మేర డబ్లింగ్ చేపట్టాల్సి ఉండగా తెలంగాణలోనే 294 కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు. డోన్ వరకూ జరగాల్సిన డబ్లింగ్ పనులకు కేంద్ర బడ్జెట్లో రూ.220 కోట్లు కేటాయించారు. డబ్లింగ్ పూర్తైతే 130 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించే అవకాశం ఉంటుంది. కొత్త రైళ్లు, సకాలంలో రైళ్ల రాకపోక లతో కొడంగల్-మహబూబ్నగర్, రాయచూరు- దేవరకద్ర వాణిజ్య కారిడార్లకు రవాణా సేవలు, మహబూబ్నగర్,జడ్చర్ల నుంచి ఆహార ధాన్యాల సరఫరా, గద్వాల, ఇటిక్యాల పారిశ్రామిక క్లస్టర్లకు, మహబూబ్నగర్, గద్వాలలోని గోదాములు, కోల్ట్ స్టోరేజీలకు రవాణా సేవలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

Mahbubnagar Musheerabad Railway Line :మహబూబ్​నగర్- ముసీరాబాద్ మధ్య 246 కిలోమీటర్ల రైలుమార్గం 1997-98లో మంజూ రైంది. మహబూబ్​నగర్, దేవరకద్ర, మరికల్, జక్లేరు, ఉప్పర్పల్లి, మక్తల్, చందాపూర్, మాగనూరు, కున్సి, కృష్ణా రైల్వే స్టేషన్ల వరకు పనులు పూర్తయ్యాయి. మహబూబ్​నగర్​ నుంచి కర్ణాటక సరిహద్దు కృష్ణా వరకు ప్యాసింజర్ రైళ్లు నడపడానికి అవకాశం ఏర్పడింది. ఇంకా దాదాపు 80 కిలో మీటర్ల రైలుమార్గం పూర్తి కావాల్సి ఉంది. మహబూబ్నగర్గద్వాల వరకు విద్యుద్దీకరణ సైతం పూర్తి చేశారు. గద్వాల-రాయచూరు మధ్య గతంలోనే విద్యుదీకరణ పనులు చేపట్టడంతో ఇప్పుడు హైదరాబాద్లోని మౌలాలి నుంచి నేరుగా రాయచూరు వరకు రైళ్లు విద్యుత్తు సాయంతో రాకపోకలు సాగిస్తున్నాయి. మహబూబ్​నగర్​- హైదరాబాద్ మధ్య దాదాపు ఏడేళ్ల తర్వాత డబ్లింగ్పనులు పూర్తవడంతో రైళ్ల సంఖ్య పెరిగింది. కొత్తగా హైదరాబాద్- బెంగళూరు వందేబారత్ రైలు, మహబూబ్నగర్ నుంచి విశాఖపట్నం రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.

Modernization of Railway Stations :ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, షాద్నగర్, జడ్చర్ల, గద్వాల రైల్వే స్టేషన్లను అమృత్​ భారత్​ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ పథకం ద్వారా జడ్చర్ల రైల్వే స్టేషన్ లో కోటి37లక్షలతో లిఫ్టులు, రూ.7 కోట్లతో నిరీక్షణ గదులు, సమాచార బోర్డులు, స్టేషన్ ప్రాంగణం అభివృద్ధి, రెండున్నర కోట్లతో దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించనున్నారు. రూ.9.49 కోట్లతో గద్వాల రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తారు. అమృత్​ భారత్​ కింద ఇప్పటికే మహబూబ్​నగర్​ రైల్వే స్టేషన్​కు లిఫ్టులు, ఎస్కలేటర్లు మంజూరయ్యాయి. మొత్తంగా 4 స్టేషన్లలో పూర్తి సౌకర్యాలు అందుబాటు లోకి రానున్నాయి. ఇలా ప్రయాణీకుల సౌకర్యాలు మాత్రమే కాకుండా కొన్ని రైళ్లను ఆయా స్టేషన్లలో ఆపాలని, ప్యాసింజర్ రైళ్ల సంఖ్య పెంచాలని, రైళ్లవేళల్లో మార్పులు తేవాలన్న డిమాండ్లు మాత్రం కొనసాగుతున్నాయి.

త్వరలోనే మహబూబ్​ నగర్ డబుల్ లైన్ పూర్తి : జీఎం

ABOUT THE AUTHOR

...view details