YouTube Influencers On Betting Apps : యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల్లో ఫాలోవర్లు. వీడియో పోస్టు చేస్తే క్షణాల్లో వేలల్లో వీక్షణలు(వ్యూస్), కామెంట్లు. ఇంతలా జనాన్ని ఆకర్షించే వీళ్లు డబ్బులకు కక్కుర్తిపడి బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్ తదితర యాప్‌లను ప్రచారం చేస్తూ యువతను తప్పుదోవపట్టిస్తున్నారు. బెట్టింగ్తో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ యూట్యూబర్ బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేస్తూ వీడియో పోస్టు చేశాడు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ వీడియోను తప్పుబడుతూ పోస్టు చేయడంతో ఆ యూట్యూబర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇలా చాలామంది బెట్టింగ్, నకిలీ ఉద్యోగ ప్రకటనలను ప్రచారం చేస్తున్నారు.
ఆన్‌లైన్ గేమ్‌లో డబ్బు సంపాదించానంటూ : ఇంటర్వ్యూలు, సరదా వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్లను పెంచుకుంటున్న ఇన్‌ఫ్లూయెన్సర్లు పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. వీరి కంటెంట్ నచ్చి ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది బెట్టింగ్ యాప్‌లు, వెబ్‌సైట్లకు ప్రచారం చేయడం చాలా సమస్యగా మారుతోంది. కొత్తగా విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అశ్లీల వీడియోల క్లిప్పింగులను పోస్టు చేసి మొత్తం వీడియో చూడాలంటే బయోలోని లింకు క్లిక్ చేయాలని తెలుపుతున్నారు.
పొరపాటున దాన్ని క్లిక్‌చేస్తే నేరుగా టెలిగ్రామ్ గ్రూప్‌లోకి వెళ్తారు. కొన్నిసార్లు ఫోన్లలో సైబర్ నేరగాళ్లు రూపొందించిన మాల్‌వేర్‌లు, డేటా సేకరించే యాప్‌లు డౌన్‌లోడ్ అవుతుంటాయి. ప్రముఖ సంస్థల్లో వర్క్‌ఫ్రమ్ హోమ్‌విధానంలో ఉద్యోగాలున్నాయని, రోజూ రూ.వేలల్లో ఆదాయం ఉంటుందని ఇటీవల ఓ ప్రముఖ యూట్యూబర్ వీడియో పోస్టు చేశాడు.
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో : ఈ లింకు క్లిక్ చేయగా ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు సంబంధించిన వెబ్‌సైట్ దర్శనమిచ్చింది. కంబోడియాలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో తెలంగాణ యువత చిక్కుకోవడానికి ఇలాంటి తప్పుడు ప్రచారమే కారణం. విదేశాల్లో ఉద్యోగాలంటూ పోస్టు చేసిన వివరాలతో ఉచ్చులో చిక్కుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సామాజిక మాధ్యమాలు వేదికగా చేసే వీడియోల్లోని కంటెంట్ మీద పెద్దగా దృష్టిపెట్టకపోవడం ప్రధాన కారణం. వివాదాస్పదమైనప్పుడే పోలీసులు బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నారు.
కేసులు ఎదుర్కోవాల్సిందే : రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్‌పై గతంలోనే నిషేధం విధించింది. ఆన్‌లైన్ గేమ్‌లు ఆడినా ప్రోత్సహించినా శిక్షార్హులు అవుతారు. ఆన్‌లైన్, సామాజిక మాధ్యమాల్లో బెట్టింగ్‌కు ప్రచారం కల్పించడం, వాటిని ప్రోత్సహించడం నిషేధం. ఈ నిబంధనల్ని ఉల్లంఘించి ప్రచారం చేస్తే వినియోగదారుల పరిరక్షణ చట్టం- 2019 కింద కేసులు నమోదు చేస్తారు.
వాళ్లను నమ్మి ఆన్‌లైన్ గేమింగ్ ఆడారో - నట్టేట మునిగినట్టే!