LRS Applications in Telangana :తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన స్థలాల క్రమబద్ధీకరణ ఎల్ఆర్ఎస్ పథకంతో కొత్తగా మరో ఐదు లక్షల మందికి లబ్ధిచేకూరే అవకాశముంది. రాష్ట్రంలో స్థలాల క్రమబద్ధీకరణకు 2020లోనే ఉత్తర్వులు వెలువడగా 25.67 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వివిధ కారణాలతో ఇప్పటి వరకు సుమారు 9 లక్షల దరఖాస్తులను పరిష్కరించగలిగారు. పెండింగ్ అర్జీలన్నీ ఒకేసారి పరిష్కరించేందుకు 25 శాతం రాయితీ ఇస్తూ ప్రభుత్వం ఇటీవలే ఓటీఎస్‌ను ప్రకటించింది.
ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ మొదలు :మరోవైపు ఏదైనా లేఅవుట్లో 10 శాతం మాత్రమే స్థలాలు అమ్ముడై , 90 శాతం ఖాళీగా ఉన్న ప్లాట్లకు కూడా నిర్ధారిత ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం కల్పించారు. దీనివల్ల దాదాపు ఐదు లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. ఇలాంటి స్థలాలను కొన్నవారు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి నేరుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఈ వెంచర్ల పరిశీలన గతంలోనే పూర్తవడమే ఇందుకు కారణం.
సాంకేతిక సమస్యలపై అధికారుల దృష్టి : ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల్లో 16 లక్షల వరకు పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటి విస్తీర్ణం ఆధారంగా ఆన్లైన్లో ఫీజు చెల్లించాలి. ఈ మేరకు దరఖాస్తుదారుడి ఫోన్‌కు లింకును పంపుతారు. దాన్ని తెరిచి ఆన్లైన్లో ఫీజు చెల్లించిన వారి స్థలాన్ని అధికారులు తనిఖీ చేసి, అన్నీ మంచిగా ఉన్నాయనుకుంటే ప్రోసీడింగ్స్ అందజేస్తారు. దాంతో స్థల క్రమబద్ధీకరణ పూర్తవుతుంది.