Pawan Kalyan Varahi Vijayabheri: కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ముందుకు వెళతామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వారాహి విజయభేరిలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం, భీమవరంలో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్న పవన్ ప్రతిసారీ తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతూ సీఎం జగన్ దిగజారిపోయారని విమర్శించారు. అంతకుముందు నరసాపురం సభలో మాట్లాడిన పవన్ తన అన్న చిరంజీవి జోలికి వస్తే సహించేది లేదని సజ్జల రామకృష్ణారెడ్డిని హెచ్చరించారు. నదులను అనుసంధానిస్తామని, వీలైనంత త్వరగా పోలవరం పూర్తి చేసి వలసలు, పస్తులు లేని రాష్ట్రాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. చేతివృత్తులను ఆదుకుంటామన్న పవన్, భవన నిర్మాణ కార్మికులను కాపాడుకుంటామని పేర్కొన్నారు. పవన్‌కు జనసైనికులు, తెలుగుదేశం, బీజేపీ కార్యకరక్తలు భారీగా తరలివచ్చి మద్దతు తెలిపారు.
రాజానగరం గంజాయి, ఇసుక దోపిడీకి కేంద్రంగా మారింది: పవన్ కల్యాణ్ - Pawan Kalyan Varahi Yatra
ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రజలకు కీలకమని, రాష్ట్ర భవిష్యత్తు కోసం కేంద్రంతో మాట్లాడి పొత్తు కోసం చాలా విషయాల్లో తగ్గానని తెలిపారు. అన్న క్యాంటీన్లతోపాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లనూ నడిపిస్తామన్నారు. వశిష్ట వారధి పూర్తి చేయకుండా ఓట్లు అడగబోనని చెప్పిన జగన్‌కు ఈ ఎన్నికల్లో ప్రచారానికే అర్హత లేదని మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో 34 శాతమున్న బీసీ రిజర్వేషన్లను 24 శాతం చేసి రాజకీయ ప్రాధాన్యం లేకుండా చేశారని, రిజర్వేషన్‌ను తమ కూటమి ప్రభుత్వం పునరుద్ధరిస్తుందని పవన్ భరోసా ఇచ్చారు. కోనసీమలో రైలు కూత నరసాపురం వరకు వినిపించేలా చేస్తామని అన్నారు.
ఆక్వా రైతులు కష్టాలు చెప్పి జగన్‌ను సాయం కోరితే వారికి గుదిబండలా మారారని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం యూనిట్ విద్యుత్తు రూపాయిన్నర రాయితీతో ఇస్తే జగన్ 5 రూపాయలు చేసి నిండా ముంచారని అన్నారు. ప్యాలెస్‌ల మీద ప్యాలెస్‌లు కడుతున్న జగన్‌కు హార్బర్, జెట్టి కట్టడం చేత కాలేదన్న పవన్, 70 లక్షల మత్స్యకార కుటుంబాలను దోచేందుకు 217 జీవో తెచ్చారని ఆరోపించారు. దాన్ని మన ప్రభుత్వం రాగానే రద్దు చేస్తామని, మత్స్యకారులకు రూ.10 లక్షల ప్రమాద బీమా వర్తింపజేస్తామని పేర్కొన్నారు. శెట్టి బలిజలపై తప్పుడు ఎక్సైజ్ కేసులు తొలగిస్తామని భరోసా ఇచ్చారు.
మద్య నిషేధం అన్నారు - సారా వ్యాపారం చేస్తున్నారు: పవన్ కల్యాణ్ - Pawan Kalyan Key Comments
అన్ని కులాలు బాగుపడాలని కోరుకునేవాణ్ని:తాను కాపుల కోసం పార్టీ పెట్టలేదన్న పవన్, అన్ని కులాలు బాగుపడాలని కోరుకునేవాణ్ని అని, ఓటుబ్యాంకు రాజకీయాలు చేయనని స్పష్టం చేశారు. జగన్‌కు కాపు ఓట్లు కావాలన్న పవన్, వారితో తనను తిట్టించాలనే లక్ష్యంతో పని చేస్తున్నారని విమర్శించారు. మీరు శివశివాని స్కూల్‌లో పేపర్లు లీక్ చేసే కాలంలోనే తాను చేగువేరా గురించి చదువుతున్నానని తెలిపారు. మీకు, నాకు అంత వ్యత్యాసముందని అన్నారు. తాను ఎమ్మెల్యే ప్రసాదరాజును తిడితే ఆయన్ని మాత్రమే తిట్టినట్లు అని, ఆయన కులాన్ని కాదని స్పష్టం చేశారు. నరసాపురంలో కక్షకట్టి ఒకే కులానికి చెందిన 40 మంది అధికారులను అన్యాయంగా బదిలీ చేయించారని, జగన్ కులాలను విడగొడితే తాను ఏకం చేస్తానని తెలిపారు.