Pawan Kalyan took Petitions from People who came with Problems:ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రజల్ని కలుసుకుని వారి సమస్యలు పరిష్కరించే పని ప్రారంభించారు. గతంలో జనసేన పార్టీ తరపున జనవాణి కార్యక్రమం నిర్వహించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి అడుగులు వేశారు. శనివారం మధ్యాహ్నం అసెంబ్లీ నుంచి తిరిగి వస్తూ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వెలుపల బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ వద్ద ఆగారు. వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజలను పవన్ కల్యాణ్ కలిసి వారి నుంచి వినతి పత్రాలు తీసుకొని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అని ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేశారని, గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు పవన్ కల్యాణ్ ముందు కన్నీటిపర్యంతమైంది. మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇంకా పోలీసులు స్పందించడంలేదని వేదన చెందారు. తమ బిడ్డను తమకు అప్పగించే విషయంలో పోలీసులు ఉదాసీనంగా ఉన్నారని తెలిపారు. వెంటనే పవన్ కల్యాణ్ గారు మాచవరం సీఐకి ఫోన్ చేసి ఈ కేసుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్కు పంపించారు.