Couple who took their Lives Due to Financial Issues in Bhupalpally : వాళ్లది నిరుపేద కుటుంబం. శిథిలమైన పెంకుటిల్లు తప్ప మరే ఆధారం లేదు వారికి. రోజూ ఆ దంపతులిద్దరూ కూలికి వెళ్తేనే పొట్ట గడిచేది. కాయకష్టంతో ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్న వారు చేసిన కొద్దిపాటి అప్పు, దానికి ప్రతి వారం చెల్లించాల్సిన రూ. 200 కిస్తీ గుదిబండగా మారాయి. అనారోగ్యాలు, ఖర్చులకుతోడు అప్పిచ్చినవారి వేధింపులతో విసిగిపోయిన ఆ భార్యాభర్తలు బలవన్మరణాలకు పాల్పడ్డారు.
వారానికి రూ. 200ల కిస్తీ : ఇద్దరు పిల్లల్ని అనాథలుగా మిగిల్చారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలోని భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన బానోత్ దేవేందర్ (37), చందన (32) దంపతులు వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి ఇద్దరు కుమారులు రిషి (14), జశ్వంత్ (12)లు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. గ్రామాల్లో కొంతమంది మహిళలను గ్రూపుగా ఏర్పరిచి ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారులు రుణాలిస్తుంటారు. కొద్ది నెలల క్రితం చందన సభ్యురాలిగా ఉన్న సంఘం సభ్యులంతా కలిసి రూ.2.50 లక్షల వరకు అప్పు తీసుకున్నారు. దీనికి ప్రతి వారం రూ. 200 కిస్తీ కట్టాల్సి ఉంటుంది.
'నాన్నా.. నాన్నా' అంటూ కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు - ఇద్దరు కుమార్తెలను కాల్వలోకి తోసిన తండ్రి
వాళ్ల ఒత్తిడి వల్లే మనోవేదన ఆపై ఆత్మహత్య : కొన్నాళ్లు సక్రమంగానే చెల్లించినా భర్త, పిల్లలు అనారోగ్యాల బారిన పడడంతో చందన కొన్నాళ్లుగా కిస్తీలు కట్టలేకపోయింది. దీనిపై ఫైనాన్స్ యజమాని ఒత్తిడి చేయడంతో భార్యాభర్తలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. చందన డిసెంబరు 6న గడ్డి మందు తాగగా ఇరుగుపొరుగు వారు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితిపై ఆందోళనతో దేవేందర్ అదే నెల 20న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య (Suicide) కు పాల్పడ్డాడు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చందన మంగళవారం మృతి చెందింది. సుమారు పది రోజుల వ్యవధిలో తల్లితండ్రులను కోల్పోయిన ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు. ఈ ఘటనలపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు భూపాలపల్లి సీఐ నరేష్‌కుమార్ తెలిపారు.