Drunk And Drive Cases in Hyderabad At New Year Occasion : 2024కు వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు అంబరాన్నంటాయి. పార్టీలు, ఈవెంట్లు, గెట్ టుగెదర్లకు ఈ డిసెంబర్ 31 వేదిక అయ్యింది. సరదా కార్యక్రమాల్లో భాగంగా పలువురు మందేస్తూ చిందేశారు, అంతటితో ఆగకుండా వాహనాలు నడిపారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున మద్యం సేవించిన వారు వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కారు.
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,184 కేసులు నమోదయ్యాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 619 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. ఆకతాయిలు, మందుబాబులపై దృష్టి సారించారు.
నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణలో మద్యం విక్రయాలు సరికొత్త రికార్డు లిఖించాయి. డిసెంబర్ 31కి ముందుగా వారం రోజుల్లో కోట్ల విలువైన సరుకు అమ్ముడుపోయింది. మద్యం డిపోల నుంచి ప్రతి రోజు దాదాపు రూ.200 కోట్ల విలువైన మద్యం సరఫరా అయినట్లు తెలుస్తోంది. ఒక్క డిసెంబర్ నెలలోనే రూ.3,805 కోట్ల విలువైన 38.07లక్షల లిక్కర్ కేసులు, 45.09 లక్షల కేసుల బీర్లు అమ్ముడు పోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు తీసుకుంటే ఏకంగా రూ.37,682 కోట్ల విలువైన 3.76 కోట్ల లిక్కర్ కేసులు, 5.47 కోట్ల కేసుల బీర్లు విక్రయించినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు.