TTD Calendar Online Booking: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (TTD Board) తీపి కబురు అందించింది. 2025 నూతన సంవత్సరం క్యాలెండర్‌తో పాటు డైరీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిని కావాలనుకునే భక్తులు ఇప్పటి వరకు ఆఫ్‌లైన్‌లో, పోస్టల్ విధానం ద్వారా కొనుగోలు చేసేవారు. కానీ, ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి క్యాలెండర్లు, డైరీలను ఇంటికే తెప్పించుకోవచ్చు. 2025 క్యాలెండర్ 12 పేజీలు, 6 పేజీలు, సింగిల్ షీట్, టేబుల్ టాప్ క్యాలెండర్లు సైతం అందుబాటులో ఉన్నట్లు టీటీడీ వెల్లడించింది. వాటిని ఎలా బుక్ చేసుకోవాలంటే!
దర్శనం టికెట్ బుక్ చేసుకుని వెళ్లకపోతే మరో అవకాశం? - టీటీడీ ఈవో ఏమన్నారంటే!
టీటీడీ నూతన సంవత్సరం క్యాలెండర్లు వేంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్ల పెద్ద సైజు, పద్మావతి సమేతంగా శ్రీవారి ఫొటోతో అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు డీలక్స్ డైరీలు, మినీ డైరీలను కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. క్యాలెండర్‌లు, డైరీలు కావాల్సిన వారు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ అవకాశంతో పాటు గతంలో మాదిరిగా టీటీడీ ఎంపిక చేసిన ప్రాంతాల్లో శ్రీవారి క్యాలెండర్లను నేరుగా కొనుగోలు చేయవచ్చు. తిరుమల, తిరుపతి, హైదరాబాద్, విజయవాడతో పాటు తిరుచానూరు, చెన్నై, బెంగళూరు, వైజాగ్, దిల్లీ, ముంబయి, వేలూరులోని ప్రముఖ బుక్ స్టోర్లు, టీటీడీ కళ్యాణ మండపాల్లో శ్రీవారి క్యాలెండర్లు అందుబాటులో ఉన్నాయి.
ధరలు ఇలా
- శ్రీవారి పెద్ద డైరీ ధర రూ.150
- చిన్న డైరీ రూ.120
- 12 షీట్ క్యాలెండర్ రూ.130
- టేబుల్ క్యాలెండర్ రూ.75
ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే భక్తులు డైరీ ధరతో పాటు పోస్టల్ ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
క్యాలెండర్లు, డైరీలు ఆన్‌లైన్‌లో ఇలా బుక్ చేసుకోవచ్చు..
మొదట https://ttdevasthanams.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో More Services ఆప్షన్‌పై క్లిక్ చేసి Diaries/Calendar/panchagam ఆప్షన్ ఎంచుకోవాలి.
కొత్త పేజీ ఓపెన్ కాగానే అందులో లాగిన్ వివరాలు నమోదు చేయాలి. మీరు ఇంతకుముందే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే ఆ వివరాలతో లాగిన్ కావచ్చు. లేదంటే కొత్తగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
హోమ్‌పేజీలో Services ఆప్షన్లో పబ్లికేషన్స్‌లో Diaries/Calendar/panchagam పై క్లిక్ చేసి కొనుగోలు చేయాలనుకుంటున్న డైరీ లేదా క్యాలెండర్ ఆప్షన్లను ఎంచుకోవాలి.
India లేదా International ఆప్షన్ ఎంచుకుని కావాల్సిన డైరీ లేదా క్యాలెండర్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఎన్ని డైరీలు కావాలో ఆ నెంబర్ ఎంటర్ చేసి Proceed ఆప్షన్‌పై క్లిక్ చేస్తే మీ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. పూర్తి అడ్రస్ నమోదు చేసిన తర్వాత మీరు ఎంపిక చేసుకున్న ఐటెమ్స్ ధరతో పాటు పోస్టల్ చార్జీలు కనిపిస్తాయి. ఆన్‌లైన్ పేమెంట్ పూర్తి చేస్తే మీ ఇంటికే నేరుగా డెలివరీ వచ్చేస్తాయి.