Court Remand to Kodali Nani Follower Kali: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు, కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల కాళీకి న్యాయస్థానం రిమాండ్ విధించింది. గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కాళీని గుడివాడ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. ఈ నెల 10 వరకు కాళీకి న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఆ తర్వాత నిందితుడు పోలీసులు కాళీని నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు.
వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా గుడివాడ టీడీపీ కార్యాలయం, పార్టీ నేత రావి వెంకటేశ్వరరావుపై దాడి కేసులో కాళీది కీలక పాత్ర. 2022 డిసెంబరు 25న కాళీ తన అనుచరులతో కలిసి టీడీపీ కార్యాలయం, వెంకటేశ్వరరావుపై పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేశాడు. ఈ ఘటనపై వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేసినా అప్పటి అధికార పార్టీ అండతో నిందితులను అరెస్టు చేయలేదు. పైగా రావి వర్గీయులు, ఇతర టీడీపీ నాయకులపై పోలీసులు ఎదురు కేసులు నమోదు చేశారు.
ఇది వైఎస్సార్సీపీ రాజ్యం అనుకుంటున్నారా? - తోలు తీసి కూర్చోపెడతా ఖబడ్దార్ : పవన్ కల్యాణ్
కూటమి ప్రభుత్వం వచ్చాక సంఘటన వీడియోలను పోలీసులు పరిశీలించి హత్యాయత్నం సెక్షన్‌ను జోడించారు. ఈ క్రమంలో డిసెంబరు 4న 10 మంది నిందితులను ఏకకాలంలో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మరో ముగ్గురిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ముఖ్య నిందితుడైన కాళీ అస్సాంలో చేపల వ్యాపారం చేస్తున్నాడని గుర్తించి పక్కా ప్రణాళికతో మంగళవారం అదుపులోకి తీసుకుని గుడివాడకు తీసుకొచ్చారు. నేడు వైద్యపరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.
కొడాలి నాని అరెస్ట్ అయ్యే అవకాశం: మరోవైపు ఇదే కేసులో మాజీ మంత్రి కొడాలి నాని సైతం అరెస్ట్ అయ్యే అవకాశముంది. గతంలో అరెస్టయిన 13 మంది నిందితులను గుడివాడ పోలీసులు రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో వారు కొడాలి నాని ఆదేశాల మేరకే దాడులకు పాల్పడ్డామని విచారణలో వెల్లడించినట్లు సమాచారం. వారి మాటల్లో వాస్తవాలు ఉన్నట్లు రుజువైతే కొడాలి నానిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముంది.
కూటమి పార్టీల మధ్య సమన్వయం లోపించిందా? - చేరికల విషయంలో ఎందుకీ గందరగోళం
సెల్యూట్ టు ఏపీ పోలీస్ - 'చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లిన సీఐ'