Ram Mohan Naidu at Aero India 2025: బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా ప్రదర్శనకు ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెళ్లారు. ఈ సందర్భంగా యుద్ధ విమానంలో ప్రయాణించారు. స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధవిమానాలు తయారు చేయడంపై కేంద్రమంత్రి ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఏరో ఇండియా-2025లో భాగంగా యుద్ధ విమానాన్ని నడిపడం మరచిపోలేని అనుభూతినిచ్చిందంటూ ఎక్స్ వేదికగా తెలిపారు. హెచ్ఏఎల్ (Hindustan Aeronautics Limited) స్వదేశంలో సగర్వంగా తయారు చేసిన హెచ్ జేటీ-36 'యశస్' అనే అద్భుతమైన జెట్ విమానంలో ప్రయాణించే అరుదైన అవకాశం లభించిందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విమానయాన, రక్షణ తయారీలో రోజురోజుకూ పెరుగుతున్న పరాక్రమానికి ఈ స్వదేశీ అద్భుతం నిదర్శనమని కొనియాడారు.
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) February 11, 2025
ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉందంటూ రామ్మోహన్ నాయుడు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాగా బెంగళూరులోని యలహంక వైమానిక కేంద్రంలో ఏరో ఇండియా 2025 షో (Aero India 2025) 10వ తేదీన మొదలైంది. ఇది 14వ తేదీ వరకూ జరగనుంది.
రాజ్యసభలో రామ్మోహన్‌నాయుడిపై సుధామూర్తి మాతృప్రేమ - ఏం జరిగిందంటే