Cardiology Doctors Shortage Impact on Patients :ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో గుండె సంబంధిత సమస్యలు(హృద్రోగ), గుండెపోటుతో వచ్చే బాధితులకు చికిత్స అందుబాటులో లేకుండాపోయింది. రిమ్స్‌కు అనుబంధంగా ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కార్డియాలజీ విభాగం అందుబాటులో ఉండి అందులో అత్యాధునిక(అడ్వాన్సిడ్) క్యాథ్‌ల్యాబ్, ఇతర పరికరాలు సైతం ఉన్నాయి. అవసరమైన గుండె వ్యాధి నిపుణులు(కార్డియాలజిస్ట్, కార్డియాలజీ సర్జన్) లేక అవన్నీ నిరుపయోగంగా మారిన పరిస్థితి నెలకొంది.
కార్డియాలజీ వైద్య నిపుణులు లేకపోవటంతో గతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు చెందిన సీఎఫ్ ఒకరు మృత్యువాత పడ్డారు. ఆసుపత్రికి గుండె సంబంధిత సమస్యతో వచ్చిన వారికి ఇక్కడ ప్రాథమికంగా పరీక్షలు చేసి హైదరాబాద్ లేదా మహారాష్ట్రకు రెఫర్ చేయాల్సి దుస్థితి నెలకొంది. సుదూర ప్రాంతంలోని ఆసుపత్రికి వెళ్లేలోపు బాధితుడికి సమస్య మరింత తీవ్రమై ప్రాణాపాయం ఏర్పడే అవకాశాలున్నాయి.
నిరుపేదలకు తప్పని తిప్పలు :ఆదిలాబాద్ పట్టణంలోని 2 ప్రైవేటు హాస్పిటల్స్‌లో క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం అందుబాటులో ఉంది. అయితే ఆ ఆసుపత్రుల్లో ఎంజియోగ్రాం చేయించుకోవటానికి దాదాపు రూ.25 వేలకు పైగా వ్యయం చేయాల్సి ఉంటోంది. ఒక వేళ స్టంట్ వేయాల్సి వస్తే అదనంగా రూ.1.50 లక్షల నుంచి రూ.రెండు లక్షల వరకు వ్యయం చేయాల్సి వస్తోంది. ఈ మేరకు నిరుపేదలకు అంతసొమ్ము చెల్లించే స్తోమత ఉండటం లేదు. ఈ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం కూడా అందుబాటులో లేకపోవడంతో బాధితులు తీవ్ర ఆర్థిక కష్టనష్టాలకు గురవు తున్నారు.
నిరుపయోగంగా క్యాథ్‌ల్యాబ్ :ఇది రిమ్స్ అనుబంధ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని క్యాథ్‌ల్యాబ్ గది. హృద్రోగ సంబంధిత సమస్యల బాధితులకు ఈ గదిలోనే ఎంజియోగ్రాం చేయటంతో పాటు అవసరమైన స్టెంట్లు వేయటం, శస్త్ర చికిత్సలు చేసేవిధంగా అన్ని అత్యాధునిక హంగులతో అందుబాటులోకి తీసుకొచ్చారు. అందుబాటులోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా చికిత్స అందలేదు. కారణం ఆ విభాగంలో సంబంధిత వైద్యులు లేకపోవటమే.