Passengers Facing Problems:అధికార పార్టీ సిద్ధం సభలతో సామాన్యులకు తిప్పలు తప్పడం లేదు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో సిద్ధం సభకు జనాన్ని తరలించేందుకు పెద్ద ఎత్తున బస్సులను కేటాయించారు. మొత్తం 3 వేల 500 బస్సుల తరలించినట్లు సమాచారం. గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి 675 బస్సులు కేటాయించారు. వివిధ పనుల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లేవారు ఉదయం నుంచే బస్టాండ్లలో పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడు బస్సులు వస్తాయో కూడా తెలియదు. వచ్చిన ఒకటో, రెండో బస్సుల కోసం జనం ఎగబడ్డారు. బస్సులపై సమాచారం అడిగినా యాజమాన్యం స్పందించట్లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కనిగిరి డిపో నుంచి 48 బస్సులను సిద్ధం సభకు కేటాయించారు.దీంతో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.బస్సుల కోసం ఎండలోనే నిరీక్షిస్తున్నారు.చీరాల డిపోలో 96 బస్సులు ఉండగా 80 బస్సుల వరకు సభకు వెళ్లాయి. బస్సుల కోసం ప్రయాణికులు చాలా సమయం ఎదురుచూశారు.
బస్సులు ఎప్పుడు వస్తాయని ఆర్టీసీ అధికారులను అడిగితే జగన్‌ను వెళ్లి అడగండి అని దురుసుగా సమాధానమిస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంగళగిరి డిపోలో సాధారణ 23 బస్సులు ఉంటే అన్నింటినీ మెదరమెట్ల పంపించామన్నారు. బస్సులో లేకపోవడంతో మంగళగిరి బస్టాండ్ వెలవెలబోతోంది.
జగన్ సేవకు అంకితమైన ఆర్టీసీ- సామాన్య జనానికి చుక్కలు చూపిస్తోన్న వైఎస్సార్సీపీ
సిద్ధం సభకు నెల్లూరు జిల్లాలోని 6 డిపోల నుంచి 332 బస్సులను తరలించారు. దీంతో నెల్లూరు డిపోలో బస్సుల్లేక ప్రాంగణం వెలవెలబోతుంది. బస్సులు లేవన్న విషయం తెలియని ప్రయాణికులు, బస్టాండ్‌కు చేరుకొని గంటలు తరబడి వేచి చూశారు. బస్సులు ఎప్పుడు వస్తాయో తెలియక ప్రయాణికులు గందరగోళంలో పడ్డారు. ఆర్టీసీ సిబ్బందిని అడిగితే బస్సులు ఎప్పుడొస్తాయో తెలియదని సమాధానం చెప్పడంతో నిట్టూరుస్తూ వెనుదిరుగుతున్నారు. అత్యవసరంగా వెళ్లాల్సినవారు అధిక ఛార్జీలు వెచ్చించి ఆటోల్లోనే గమ్యస్థానాలకు వెళ్తున్నారు. సామాన్యులను వదిలేసి అధిక పార్టీ సభలకు బస్సులను పంపించడం ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.