Private Travel Bus in Bhadrachalam : బస్సుకు ముందు భాగంలో అద్దం లేకుండా ప్రయాణికులను తీసుకువెళ్దామని ప్రయత్నించిన బిఎస్ఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ప్రయాణికులంతా అడ్డుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్‌కు ప్రయాణికులను తీసుకువెళ్తోంది. టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు బస్సుకు ముందు అద్దం లేకపోవడంతో ఇదేంటని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులను ప్రశ్నించారు.
అయితే అద్దం లేదని ప్రశ్నించిన ప్రయాణికులకు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ డ్రైవర్ గొడవకు దిగడంతో ప్రయాణికులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్సులో ప్రయాణం చెయ్యలేమని చెప్పిన కొందరు ప్రయాణికులకు డబ్బులు తిరిగి ఇవ్వగా ఇంకొందరిని పాల్వంచలోకి వెళ్లగానే వేరే బస్సు ఎక్కిస్తామని చెప్పి తీసుకెళ్లారు.
అధిక ఛార్జీలు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ప్రతిరోజు రాత్రి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్‌కు నడుపుతున్నారు. ఆర్టీసీ బస్ ఛార్జీ రూ. 500 నుంచి రూ. 800 వరకు ఉండగా, ప్రైవేట్ బస్సుల్లో ఛార్జీలు రూ. 1000 నుంచి రూ. 2వేల వరకు వసూలు చేస్తున్నారు. శని, ఆదివారాల్లో మరి అధికంగా టికెట్ల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నారు. కానీ సరైన సదుపాయాలు, అనుమతులు లేకుండా బస్సులు నడుపుతున్నారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.