MMTS Trains Delay In Hyderabad :వాహనాల రద్దీని తప్పించుకొని సమయానికి రాకపోకలు సాగించాలన్న ఉద్యోగులకు ఎంఎంటీఎస్ సర్వీసులు చుక్కలు చూపిస్తున్నాయి. అరకొరగా సర్వీసులు, కార్యాలయాల సమయానికి పొంతన లేకుండా నడుపుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్, ఘట్‌కేసర్, మల్కాజిగిరి నుంచి ఐటీకారిడార్ వైపు నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుండగా నాలుగైదు సర్వీసులకు మించి నడపకపోవడం గమనార్హం.
అవసరం లేనిచోట అదనపు బోగీలతో, అవసరమైన చోట నడపకపోవడంపై ఎంఎంటీఎస్ ప్రయాణికుల అసోసియేషన్లు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఘట్‌కేసర్ నుంచి హైటెక్‌సిటీ, మల్కాజిగిరి నుంచి హైటెక్‌సిటీ మార్గంలో మూడే ఎంఎంటీఎస్‌లు నడుపుతున్నారని, వాటి సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
సమయాలివే :
- ఘట్‌కేసర్-లింగంపల్లి మార్గంలో ఉదయం 7.20 గంటలకు ఒక ఎంఎంటీఎస్ సర్వీసు, హైటెక్‌సిటీ నుంచి ఘట్‌కేసర్ సాయంత్రం 5.45కి ఒకటి నడుపుతున్నారు.
- మేడ్చల్ - లింగంపల్లి మార్గంలో సా.3.40గంటలకు, లింగంపల్లి - మేడ్చల్ మార్గంలో ఉ.10.20కి, సా.6.10 గంటలకు ఒక ఎంఎంటీఎస్ నడుస్తున్నాయి.
- మేడ్చల్ నుంచి నాంపల్లికి ఉదయం 11.50గంటలకు మాత్రమే రైలు సర్వీసు ఉంది. ఇక్కడి నుంచి మేడ్చల్‌కు మధ్యాహ్నం 1.40గంటలకు మరో ఎంఎంటీఎస్ రైలు ఉంది.