Parties Focus On Lok Sabha Elections :ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్, జహీరాబాద్ రెండు పార్లమెంట్ స్థానాలున్నాయి. కంచుకోటగా ఉన్న మెదక్ స్థానాన్ని మరోసారి చేజిక్కించుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది. ఆ నియోజకవర్గాన్ని దక్కించుకొని గులాబీ పార్టీని దెబ్బతీయాలని కాంగ్రెస్, బీజేపీ ప్రణాళికలు రచిస్తున్నాయి. ఆ స్థానంలో విజయం సాధిస్తే మిగతా చోట్ల గెలుస్తామన్న సెంటిమెంట్‌తో మెదక్ నియోజకవర్గంలో పాగా వేసేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే తమ అనుచరులతో ప్రచారాన్ని ముమ్మరం చేసిన పార్టీల అభ్యర్థులు తమకే అవకాశం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాదరణ కలిగిన అభ్యర్థులకే ఎంపీ సీటు - ఆశావహుల బలాబలాలపై కాంగ్రెస్ ప్రత్యేక సర్వే!
Lok Sabha Elections 2024 : ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో గత ఎన్నికల్లో ఏడింటిని బీఆర్ఎస్ (BRS) కైవసం చేసుకుంది. ఈసారి బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడంతో ప్రధాన పార్టీలు ఆ జిల్లాపై కన్నేశాయి. కాంగ్రెస్ నుంచి మెదక్ ఎంపీ స్థానాన్ని మైనంపల్లి హనుమంతరావు, నీలం మధు ముదిరాజ్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం తన కుమారుడు మైనంపల్లి రోహిత్‌రావు మెదక్ ఎమ్మెల్యేగా ఉండటంతో ఎంపీ టికెట్ ఇవ్వాలని అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మెదక్ పార్లమెంట్ స్థానంలో దాదాపు 5 లక్షల పైచిలుకు ముదిరాజ్ ఓట్లు ఉండటంతో నీలం మధుకు టికెట్ ఇస్తే గెలిచి తీరతానని అధిష్టానానికి హమీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. కాగా సామాజిక కార్యక్రమాలు మధుకి కలిసొస్తాయని ఆయన అనుచరులు చెబుతున్నారు.