Panjagutta Businessman Death Mystery :హైదరాబాద్ పంజాగుట్టలో ఐదు రోజుల కింద అదృశ్యమైన వ్యాపారి ఒక గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఎలా చనిపోయాడన్నది మిస్టరీగా మారింది. పంజాగుట్ట పోలీసుల వివరాల ప్రకారం, ఎల్లారెడ్డిగూడకు చెందిన విష్ణురూపానికి (45) గోపీ అండ్ సన్స్ పేరిట కిరాణా దుకాణం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా వీరి కుటుంబం ఉమ్మడిగా ఉంటూ నాలుగైదు చోట్ల హోల్‌సేల్ వ్యాపారం నిర్వహిస్తుంది.
పంజాగుట్టలో అదృశ్యం :గత నెల 29న రాత్రి 10.30 గంటల సమయంలో విష్ణురూపాని ఇంటి నుంచి బయటకు వెళ్తూ 12 గంటల కల్లా వస్తానంటూ కుటుంబసభ్యులకు తెలిపాడు. రెండు రోజులైనా అతడు రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. దీంతో సోదరుడు మహేశ్ రూపాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అతడు ఆరోజు బయటకు వెళ్లిన సీసీ ఫుటేజ్ సేకరించారు. విష్ణు రూపాని సెల్‌ఫోన్ సిగ్నల్స్ కనిపెట్టి, ఎస్సార్‌నగర్‌లోని బుద్ధనగర్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు.
సీసీ ఫుటేజీలను పరిశీలించగా : అక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలించగా విష్ణురూపానితో పాటు రమేశ్ అనే యువకుడు సమీపంలోని గదిలోకి వెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు బుధవారం ఆ గది వద్దకు వెళ్లగా తాళం వేసి ఉంది. లోపలి నుంచి వాసన రావడంతో అనుమానం వచ్చి తాళం పగులగొట్టి గదిలోకి వెళ్లారు. కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో విష్ణురూపాని మృతదేహం కనిపించింది. రమేష్ కనిపించకపోవడం, సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ ఉండటంతో అతనిపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పంజాగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ శోభన్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు.