Palamuru Girl Sai Sangeetha Excelling in Athletics :సరదాగా తండ్రితో కలిసి జాగింగ్, రన్నింగ్‌కి వెళుతూ, అథ్లెటిక్స్‌పై మక్కువ పెంచుకుందీ అమ్మాయి. 4వ తరగతిలోనే తన క్రీడా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంది. పతకాల కోసం పరుగులు పెడుతూ, జూనియర్ ఏషియన్ అండర్-20 అథ్లెటిక్ ఛాంపియన్షిప్ వరకు వెళ్లింది. అందులో 4x4 విభాగంలో బంగారు పతకాన్ని సొంతం చేసుకుని భవిష్యత్తుకు గట్టి పునాదిని వేసుకుంది.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చెందిన దొడ్ల శ్యాంసుందర్, రాజేశ్వరీల మొదటి కుమార్తె సాయి సంగీత. శ్యాంసుందర్ నాగర్‌కర్నూల్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతను రాష్ట్రస్థాయి సీనియర్ అథ్లెట్ కావడంతో, కుమార్తెను క్రీడలవైపు ప్రోత్సహించాడు. ఉదయం, సాయంత్రం తనవెంట జాగింగ్, రన్నింగ్‌కి తీసుకువెళ్లడంతో పాటు ఆమెకు అథ్లెటిక్స్‌లో తర్ఫీదు ఇప్పించాడు.
అథ్లెటిక్స్‌లో రాణిస్తున్న పాలమూరు బిడ్డ : చిన్న వయసులోనే అథ్లెటిక్స్‌లో శిక్షణ తీసుకున్న సంగీత, 2014లో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో సత్తాచాటి హకీంపేటలోని క్రీడా పాఠశాలలో చేరింది. అనంతరం హర్డిల్స్, 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్ విభాగాల్లో ప్రత్యేక శిక్షణ పొందింది. 2023-24 విద్యా సంవత్సరంలో కర్ణాటకలోని మంగళూరులోని అల్వాస్ డిగ్రీ కళాశాలలో క్రీడా కోటా కింద సీటు సాధించానని సాయి సంగీత చెబుతోంది.
ఓ వైపు చదువు కొనసాగిస్తూనే అథ్లెటిక్స్‌లో ఆరితేరుతోందీ ఈ యువ క్రీడాకారిణి. 2017లో రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్-14 అథ్లెటిక్స్ పోటీల్లో హర్డిల్స్ విభాగంలో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. 2019 కర్ణాటకలో నిర్వహించిన సౌత్‌జోన్ టోర్నమెంట్లో 200 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం దక్కించుకుంది. 2024 ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన ఫెడరేషన్ కప్ టోర్నమెంట్లో 400, 200 మీటర్లలో బంగారు పతకాలు అందుకుని జూనియర్ ఏషియన్ పోటీలకు ఎంపికైంది.
Sai Sangeetha Selection for Asian Athletic Championship :ఏప్రిల్ 24 నుంచి 27 వరకు దుబాయ్ వేదికగా జరిగిన జూనియర్ ఏషియన్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2024 పోటీల్లో ఈ యువ అథ్లెట్ సత్తాచాటింది . 4x4 పరుగుల విభాగంలో బంగారు పతకంతో మెరిసింది. ఇప్పటివరకు 18 రాష్ట్రస్థాయి టోర్నీలతో పాటు 22 జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని పతకాలు సొంతం చేసుకున్నాని చెబుతోంది.