తెలంగాణలో 'పద్మ' పురస్కారం వరించిన కళాకారులు వీళ్లే Padma Awards Telangana 2024 : చిందు యక్షగానంలో పేరొందిన గడ్డం సమ్మయ్య స్వస్థలం జనగామ జిల్లా దేవురుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఈయన తండ్రి రామస్వామి నుంచే కళను పుణికుపుచ్చుకున్నారు. ఐదో తరగతి చదివిన సమ్మయ్య 12వ ఏట నుంచే రంగస్థల వేదికపై రకరకాల పాత్రలు వేస్తూ యక్షగానం కళను ప్రదర్శిస్తున్నారు. ఐదు దశాబ్దాలుగా 19 వేలకుపైగా ప్రదర్శనలు ఇచ్చారు. చిందు యక్షగానంలో పౌరాణిక కథలతో పాటు పలు సామాజిక అంశాలపై ప్రజల్లో ప్రచారం చేశారు.
అక్షరాస్యత, పర్యావరణ పరిరక్షణపై పాటలు, పద్యాలతో ఆకట్టుకోవడం సమ్మయ్య ప్రత్యేకత. చిందు యక్ష కళాకారుల సంఘం, గడ్డం సమ్మయ్య యువ కళాక్షేత్రం లాంటివి స్థాపించి కళను సజీవంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారు. సమ్మయ్య భార్య శ్రీరంజిని యక్షగానం ప్రదర్శనలు ఇస్తున్నారు. ప్రభుత్వం కళారత్న హంస పురస్కారంతో సత్కరించింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా రామాయణ గాథకు సంబంధించి ఐదు ప్రదర్శనలిచ్చారు.
Padma Awardees Telangana 2024 :బుర్ర వీణ వాద్య కళాకారుడు దాసరి కొండప్ప(Dasari Kondappa Got Padma Sri) స్వస్థలం నారాయణపేట జిల్లా దామరగిద్ద. ఆత్మతత్వం, జ్ఞానతత్వానికి సంబంధించిన పాటలు ఎక్కువగా గానం చేస్తారు. రామాయణం, మహాభారతం, హరిశ్చంద్ర పాటలతో పాటు పలు పౌరాణిక గాథలను వీణ వాయిస్తూ చెబుతారు. బుర్రవీణను వాయించుకుంటూ కథలు చెబుతున్న వారిలో ప్రస్తుతం దాసరి కొండప్ప ఒక్కరే ఉన్నారు. గతంలో దూరదర్శన్‌లోనూ ప్రదర్శనలిచ్చారు. దాసరి కొండప్ప తల్లిదండ్రులు వెంకప్ప, వెంకటమ్మ.
కొండప్ప బుర్ర వీణను తానే తయారు చేస్తారు. బలగం సినిమాలో 'అయ్యే శివుడా ఏమాయే' పాటను పాటినట్లు చెప్పారు. మహబూబ్‌నగర్‌లోని ఓ కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు బుర్రవీణపై శిక్షణ ఇచ్చారు. ఇప్పుడూ కొందరికి నేర్పిస్తున్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన కొండప్ప ఏదైనా పండగలు జరిగినప్పుడు బుర్రవీణ వాయించడం ద్వారా వచ్చే కొద్దిపాటి డబ్బులతోనే జీవిస్తున్నారు.
నాకు పద్మశ్రీ వద్దు... వెనక్కిచ్చేస్తా: కిన్నెర మొగులయ్య
Padma Shri Awardees Telangana 2024 :యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకిలో పుట్టిన కూరెళ్ల విఠలాచార్యకు మధుర కవిగా గుర్తింపు ఉంది. 2014లో తన ఇంటినే గ్రంథాలయంగా చేసి 5 వేల పుస్తకాలతో పుస్తక భాండాగారాన్ని స్థాపించారు. ప్రస్తుతం అందులో రెండు లక్షలకు పైగా పుస్తకాలున్నాయి. ఎంతో మంది విద్యార్థులు, నిరుద్యోగులకు, పరిశోధకులకు ఈ గ్రంథాలయం ఉపయుక్తంగా మారింది. ఇప్పటికే ఇక్కడ పరిశోధనలు చేసిన వారు 8 మంది విద్యార్థులు పీహెచ్డీ సాధించారు.
విఠలాచారి చేస్తున్న కృషిని ఇటీవల ప్రధాని మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించి అభినందించారు. ఆయన స్ఫూర్తితో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సుమారు 20 గ్రామాల్లో యువకులు స్వచ్చంద గ్రంథాలయాలను నిర్వహిస్తున్నారు. 2018లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి విశిష్ఠ పురస్కారం అందుకున్నారు. 2019లో తెలంగాణ ప్రభుత్వం ఆయనను ప్రతిష్ఠాత్మక దాశరథి పురస్కారంతో సత్కరించింది. పెన్షన్‌గా వచ్చే డబ్బులతో కూరెళ్ల విఠలాచార్య గ్రంథాలయాన్ని నిర్వహించడం విశేషం.
Telangana Padma Shri Award 2024 :ఏపీలోని చిత్తూరు జిల్లా వెన్నంపల్లిలో 1952లో జన్మించిన వేలు ఆనందాచారి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. 1980లో దేవాదాయశాఖలో సహాయ స్థపతిగా చేరిన వేలు ఉమ్మడి రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో పనిచేశారు. 2015లో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ సమయంలో ప్రధాన స్థపతిగా నియమించారు. టీవీ, రేడియోల్లో వేలు అనేక శిల్పకళా ప్రసంగాలు చేశారు. యాదాద్రి భువనగిరి మండలం ఆకుతోటబావి తండాకు చెందిన కేతావత్ సోమ్లాల్ భగవద్గీతలోని 701 శ్లోకాలను 16 నెలల పాటు అవిశ్రాంతంగా కృషిచేసి తెలుగు లిపిలో బంజారా భాషలోకి అనువదించారు. బంజారా జాతి జాగృతి కోసం 200కి పైగా పాటలు రాశారు.
పద్మశ్రీ అందుకున్న తెలుగు వారికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సత్కారం
పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం- తెలంగాణ నుంచి ఇద్దరికి పద్మశ్రీ