Organic Farming in Ghatkesar : ఒక ఎకరం విస్తీర్ణంలో రకరకాల దేశీ, విదేశీ ఆకుకూరలు సాగు చేస్తున్నారు రైతు పిట్టల శ్రీశైలం. హైదరాబాద్కు దగ్గరలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం అంకుషాపూర్‌లోని తనకున్న ఎకరం వ్యవసాయ భూమిలో సరికొత్త ఆలోచనలతో పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. కుళ్లిపోయిన కూరగాయలతో ఎరువులు తయారు చేసుకుని, సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు. రకరకాల ఆకుకూరలు పండిస్తుండటంతో స్థానికులతో పాటు హైదరాబాద్ నగర వాసులు కూడా పొలం వద్దకే వచ్చి వాటిని కొనుగోలు చేస్తున్నారు.
రైతు శ్రీశైలం సాగు చేస్తున్న ఉత్పత్తులలో 30 స్వదేశీ, 10 విదేశీ రకాల ఆకు కూరలు ఉన్నాయి. విదేశీలో బోక్సాయి, ఐస్‌బర్గ్, ఎర్ర గోంగూర, బ్రెజిల్ పాలకూర వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. స్వదేశీకి చెందినవి కొత్తి మీర, పాల కూర, చుక్క కూర, తోట కూర, ఎర్రతోటకూర, గోంగూర, పొన్నగంటికూర, కొయిగూర, గంగవాయిలి కూర, మెంతి, పులిచేరు, గలిజేరు, బంకోంటి కూర, తూటి కూర, తుమ్మి, కొండపిండికూర, కోడిజుట్టుకూర, గునుగు ఆకు, తీగ బచ్చలి, సిలోన్ బచ్చలి, గ్రీన్ బచ్చలి వంటి పలు రకాలు ఇందులో ఉన్నాయి.
సేంద్రీయం వైపే : ప్రస్తుతం చాలా మంది సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల స్థానంలో సేంద్రీయ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు.సంప్రదాయ వ్యవసాయంలో రసాయన ఎరువులు, కీటక నాశనుల వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వ్యవసాయ అవసరాల కోసం ఎక్కువగా బయటి వనరులపై ఆధారపడటం, పనిముట్లు, యంత్రాల వినియోగం, వ్యయం అధికం కావడం లాంటి సమస్యలు ఉన్నాయి. ఇవేకాకుండా ఫెర్టిలైజర్స్ వాడకంతో పర్యావరణం, జీవవైవిధ్యం, నేల నాణ్యతపై అత్యంత ప్రతికూల ప్రభావం పడుతోంది.