Operation Muskan In Telangana : నగర జీవనంలో ఆకలి వల్లో, ఆర్థిక సమస్యల కారణంగానో బాల కార్మికులు పెరుగుతున్నారు. వారిని పనిలోంచి బయటకు తీసుకొచ్చి, సంరక్షించి తల్లిదండ్రుల చెంతకు చేర్చడం లాంటి కార్యక్రమం జరుగుతోంది. ఇందుకు పలు శాఖలతో సమన్వయం చేసుకుని నగర పోలీసులు ముందుకు సాగుతున్నారు.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 25 డివిజన్‌లు ఉండగా, ఒక్కో డివిజన్‌కు ఒక్కో టీమ్‌ను కేటాయించారు. కార్మిక శాఖ, రెవెన్యూ శాఖ, బాలల సంరక్షణ శాఖ, చైల్డ్ హెల్ప్‌లైన్ సహా పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి బృందాలు ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఎస్‌ఐ లేదా ఏఎస్‌ఐతో పాటు ఆయా శాఖల నుంచి అధికారులు ఉంటున్నారు.
524 Children Were Rescued :పదో దశలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్‌తో కమిషనరేట్ పరిధిలో 524 మందిని సంరక్షించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 481 మంది బాలలు, 43మంది బాలికలు ఉన్నట్లు తెలిపారు. వీరిలో 317మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కాగా, 207 మంది పిల్లలు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారన్నారు.
234 మందిపై కేసులు నమోదు :పిల్లలను పనిలోకి తీసుకున్న వారిలో 20మందిపై కేసు నమోదైనట్లు, అలాగే వారందరికీ కలిపి రూ.11.21లక్షల జరిమానా విధించారు. ఇప్పటివరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 651 మంది పిల్లలను సంరక్షించగా అందులో 618 మంది బాలురు, 33 మంది బాలికలు ఉన్నట్లు వెల్లడించారు. కాగా కమిషనర్ పరిధిలో 234 మంది నిందితులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో :రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తంగా 326 మంది పిల్లల్ని సంరక్షించారు. అందులో రాష్ట్రానికి చెందినవారు 108 మంది. మిగతా రాష్ట్రాలకు చెందిన వారు 218 మంది. 155 మందిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో పిల్లలు ఎక్కువమంది లేబర్ పనుల్లో చేరుతున్నట్లు అధికారులు గుర్తించారు. వీళ్లను గుర్తించి, సంరక్షించుకునేందుకు అధికారుల బృందాలు తీవ్రంగా శ్రమించాయని వారిని అభినందించారు.
3076 Children Were Saved :రాష్ట్ర వ్యాప్తంగా 3,076మంది పిల్లలను సంరక్షించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 2,772 మంది అబ్బాయిలు, 304మంది బాలికలు ఉన్నారు. వారిలో 2,510 మంది బాల కార్మికులలు ఉన్నారు. పిల్లలను పనిలో చేర్చుకున్న 637 మందిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. 2023లో 2,617 మందిని కాపాడగలిగారు. ఈ ఏడాది ఇప్పటికే 3,076 మందిని రక్షించాం అని చెబుతున్నారు. 2,856 మంది బాలలు తమ ఇళ్లకు వెళ్లారని, 220 మంది రెస్క్యూ హోం లో ఉంటే 281 మంది పాఠశాలలో చేర్పించారు.
బాలకార్మిక చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు :తెలంగాణలో 120 ప్రత్యేక శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్నామని అందులో 2,499 మంది విద్యార్థులు శిక్షణ పొందారని మహిళల రక్షణ విభాగం అదనపు డీజీ శిఖా గోయల్ తెలిపారు. ఈ సందర్భంగా అధికారులను ఆమె అభినందించారు. ఎవరైనా బాలకార్మిక చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. బాలకార్మికులను గుర్తించేందుకు 676 మంది పోలీసులు పనిచేస్తున్నారని వివరించారు.