Protest across india over Doctor rape and Murder : కోల్‌కతాలో పీజీ వైద్యురాలిపై హత్యాచార ఘటన సభ్యసమాజాన్నే తలదించుకునేలా చేసింది. ఈ దుర్ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనల జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ 24 గంటలు దేశవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. రాష్ట్రంలోనూ ఆదివారం ఉదయం 6 గంటల వరకు తమ నిరసనలు కొనసాగుతాయని వైద్యులు తెలిపారు.
వరంగల్ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థినిలు ప్లకార్డులతో నిరసన ర్యాలీ చేపట్టారు. బాధితురాలి కుటుంబసభ్యులకు ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేశారు. 24 గంటలు ప్రజలందరూ సహకరించాలని రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులు పగడాల కాళీ ప్రసాద్‌రావు విజ్ఞప్తి చేశారు. వైద్యురాలిపై హత్యాచార ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని నారాయణపేటలో వైద్యులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆపద సమయంలో ప్రాణాలను కాపాడే వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేయడం దుర్మార్గమైన చర్య అని, ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
నిందితులకు కఠిన శిక్షపడేలా చేయాలని డిమాండ్ : వైద్యురాలిపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తూ సంగారెడ్డి వైద్య కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని, వైద్యులకు రక్షణ కల్పించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని వైద్యులు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో జూనియర్ వైద్యులు నిరసన చేపట్టారు. విధులు బహిష్కరించి వర్షంలోనూ ప్లకార్డులు పట్టుకొని రిమ్స్ నుంచి నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టర్ చౌక్‌లోని కుమురంభీం విగ్రహం చుట్టూ మానవహారం చేపట్టారు.