ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేధింపులు, అఘాయిత్యాలకు బెదరొద్దు - అందుబాటులో వన్‌స్టాప్‌ సెంటర్‌ - ONE STOP CENTER IN AP

మహిళలు, బాలికలకు బాసటగా కూటమి సర్కార్ - అందుబాటులోకి వన్‌స్టాప్‌ సెంటర్‌

One Stop Center in AP
One Stop Center in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 6 hours ago

One Stop Center in AP : బాలికలు, మహిళల సమస్యలను పరిష్కరించడంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి ఏపీ సర్కార్ చొరవ చూపుతోంది. అన్యాయానికి గురవుతున్న స్త్రీలు, చిన్నారులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వారి సమస్యల పరిష్కారానికి మిషన్‌ శక్తి స్కీంలో భాగంగా జిల్లాకో వన్‌స్టాప్‌ సెంటర్​ను ఏర్పాటు చేశారు. 2022లో అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడిన ఈ సెంటర్‌పై వైఎస్సార్సీపీ ప్రభుత్వం దృష్టి సారించలేదు. పాడేరు వన్‌స్టాప్‌ సెంటర్‌కు బాలికల వేధింపులపై ఇప్పటివరకు 42 ఫిర్యాదులు అందాయి. ఇక్కడ కేంద్రం ఏర్పాటు దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

కొన్ని ఉదాహరణలు..

  • 13 సంవత్సరాల అమ్మాయిని బంధువు వేధిస్తున్నాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్రంగా బాధపడింది. ఎవరికైనా చెబితే ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతూ వేధింపులను భరించింది. చివరికి ఏం చేయాలో తెలియక ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు అడిగితే జరిగిన విషయం చెప్పింది.
  • చదువుకుంటున్న సమయంలో ఓ అమ్మాయి ఒకరిని ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లి వివాహం చేసుకుంది. గర్భవతి అయ్యాక నమ్మించి పెళ్లి చేసుకున్నవాడు బాలికను వదిలేసి వెళ్లిపోయాక ఇటు పుట్టింటికి రాలేక, ఎటుపోవాలో తెలియక తను ఆత్మహత్యకు యత్నించింది. చుట్టుపక్కల వాళ్లు విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
  • కట్నం కోసం వేధించడంతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివాహితకు పుట్టింటి వారు లేకపోవడంతో పిల్లలు అనాథలయ్యారు.

ఈ సెంటర్​లో పోక్సో కేసుల్లో బాధితులకు న్యాయం చేయడానికి నిర్వాహకులు పనిచేస్తారు. బాలికపై అఘాయిత్యం జరిగితే బాధితురాలిని సంరక్షించేలా వైద్యంతో పాటు, న్యాయపరంగా అండగా నిలుస్తారు. మోసపోయిన అమ్మాయిలకు వసతి, బాధిత మహిళలకు న్యాయం చేయడంతో పాటు కౌన్సెలింగ్‌ అందిస్తారు. దీంతో కోసం వన్‌స్టాఫ్‌ సెంటర్‌లో సీఏ (సెంటర్‌ నిర్వాహకులు), పారా లీగల్, కౌన్సెలర్, కేసు వర్కర్స్, కుక్, పారామెడికల్, వాచ్‌మెన్‌ల నియామకాన్ని చేపట్టారు. ఈ సెంటర్​ను మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో నిర్వహిస్తున్నారు.

సిబ్బంది ఏమి చేయాలంటే?

  • జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా అమ్మాయిలపై దాడులు జరిగితే వెంటనే అక్కడికి వెళ్లి సమస్యను తెలుసుకోవడంతో పాటు బాధితురాలికి వైద్యం అందించాలి. దీంతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయించి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలి. బాధితురాలికి ప్రభుత్వం నుంచి అందించే రూ.లక్ష నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటారు.
  • కట్నం కోసం వేధిస్తూ వివాహిత మృతి చెందితే ఆమెకు తగిన న్యాయాన్ని అందించాలి. పోలీసుల కేసు విచారణ చేపడుతున్న సమయంలో బాధిత కుటుంబానికి అండగా ఉండాలి. పరిహారం రూ.50,000 అందేలా చూడాలి.
  • ఆడవారిని మోసగించి వారిని అనాథలుగా వదిలేసే వారికి శిక్ష పడేలా చూడాలి. వీరికి రూ.25,000 పరిహారం అందించాలి. మోసపోయి గర్భం దాలిస్తే వారికి ప్రసవం చేయించి తల్లీబిడ్డకు వసతిని అందించాలి. గతంలో ఈ తరహా బాధితులను విశాఖపట్నంలోని వన్‌స్టాప్‌ సెంటర్‌కు పంపేవారు. ఇప్పుడు అనకాపల్లిలోనే అందుబాటులోకి తీసుకొచ్చారు.

బాధితులకు న్యాయం : బాధితులకు న్యాయం అందించేలా వన్‌స్టాప్‌ సెంటర్‌ అనకాపల్లిలో అందుబాటులోకి వచ్చిందని సెంటర్‌ నిర్వాహకురాలు ఎంవీ మంజులావాణి తెలిపారు. ఇక్కడ 13 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. బాలబాలికలకు ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే తగిన న్యాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పోక్సో కేసులో బాధితులకు వైద్యంతో పాటు నిందితులకు కఠిన శిక్ష పడేలా సెంటర్‌ పనిచేస్తుందన్నారు. మహిళలపై దాడులు, అన్యాయాలు జరిగితే వారికి అండగా నిలిచి ప్రభుత్వ పరంగా న్యాయం జరిగేలా చూస్తామని ఎంవీ మంజులావాణి వెల్లడించారు.

నూతన భవనానికి స్థలం గుర్తింపు : వన్‌స్టాప్‌ సెంటర్‌కు నూతన భవనానికి కొత్తూరు నర్సింగరావుపేట వద్ద స్థలాన్ని పరిశీలించామని మహిళాభివృధ్ధి, శిశు సంక్షేమశాఖ సాధికారత అధికారి అనంతలక్ష్మి పేర్కొన్నారు. ఇక్కడ భవనాన్ని నిర్మించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆమె వివరించారు.

ఆడబిడ్డలను రక్షిద్దాం - మొదటి పోలీసింగ్ అమ్మే: హోంమంత్రి అనిత

జగన్ పాలనలో మహిళలపై భారీగా నేరాలు - గణాంకాలతో సహా వెల్లడించిన టీడీపీ

ABOUT THE AUTHOR

...view details