Constructions Against Norms in Hyderabad :నిబంధనలను ఉల్లంఘించి 40, 50 గజాల స్థలాల్లోనే హైదరాబాద్‌లో ఆరు నుంచి ఏడు అంతస్తులు నిర్మిస్తున్నారు. దీంతో కొన్ని నిర్మాణాలు కొంత కాలానికే కూలుతుండగా, మరి కొన్ని నిర్మాణం పూర్తయ్యాకే నేలమట్టం అవుతున్నాయి. కొందరు అధికారులు లంచాలకు ఆశపడి గ్రేటర్‌లో జీహెచ్‌ఎంసీ ప్రణాళిక విభాగం, శివారు ప్రాంతాల్లో సంబంధిత పురపాలక సంస్థలు, గ్రామ పంచాయతీల్లో అక్రమ నిర్మాణాలను చూస్తూ ఉంటున్నారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు కూడా వీటిని పట్టించుకోవట్లేదు.
నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు : 100, 120 గజాల్లోపు స్థలాల్లో నిర్మించే ఇళ్లకు సెట్‌బ్యాక్ నిబంధన ఉండదు. జీ+1, జీ+2 అంతస్తులకే పరిమితమవ్వాలి. కానీ 120 గజాల్లోపు స్థలాల్లో 90 శాతం నిబంధనలను ఉల్లంఘించే కట్టారు. ఫిల్మ్‌నగర్, గోషామహల్, పాతబస్తీ, కోఠి, అబిడ్స్, గచ్చిబౌలి సిద్ధిఖ్‌నగర్, చింతలబస్తీల్లో 40, 50 గజాల స్థలాల్లో ఆరు, ఏడు అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు.
స్థలం విస్తీర్ణం 150 గజాలకు మించితే పార్కింగ్ కోసం చుట్టూ ఉండే నిర్మాణాల అంచు వరకు జేసీబీతో తవ్వుతున్నారు. దీంతో పక్కనున్న భవనాల పునాదులు కదులుతున్నాయి. తాజాగా గచ్చిబౌలి సిద్ధిఖ్‌నగర్‌లో జరిగిన ప్రమాదం ఇలాంటిదేనని అధికారులు గుర్తించారు. ప్రమాదానికి గురైన భవనానికేగాక చుట్టూ ఉన్న 95శాతం నిర్మాణాలకు అనుమతి లేదు. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో 200 గజాల నుంచి వెయ్యి గజాల విస్తీర్ణంలో అపార్ట్‌మెంట్ల నిర్మాణం జరుగుతోంది. ప్రతిదీ ఏడంతస్తులే కావడం గమనార్హం. కొంత మంది అవినీతి అధికారులు ఒక్కో అంతస్తుకు రూ.5 నుంచి 10 లక్షలు తీసుకుని ఈ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు.