TG ACB Searches On Green Co Energy : కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని గ్రీన్‌కో ఎనర్జీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో తెలంగాణ ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కలెక్టర్ ఆఫీసు సమీపంలోని మాజీ మున్సిపల్ ఛైర్మన్ చలమలశెట్టి వెంకటలక్ష్మీ నివాసంలో ఈ కార్యాలయం ఉంది. ఉదయం 10 గంటల సమయంలో మొత్తం 10 మంది అధికారుల బృందం మచిలీపట్నానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆఫీసు ఉన్న ఇంటికి తాళాలు వేసి ఉండడాన్ని పరిశీలించారు. అనంతరం ఆ నివాసానికి చెందిన వారి వివరాల గురించి ఆరా తీశారు.
ఈ నేపథ్యంలోనే తాళం తీసి ఇంట్లో తనిఖీలు జరిపేందుకు ఏసీబీ అధికారులు స్థానిక పోలీసుల సహకారం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఇంటి వద్ద దృశ్యాలను చిత్రీకరిచేందుకు మీడియా ప్రయత్నించగా వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ఆదేశించారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? అనే వివరాలను అధికారులు వెల్లడించలేదు. హైదరాబాద్ మాదాపూర్‌లోని గ్రీన్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు ప్రారంభించిన కొన్ని గంటల్లోనే మచిలీపట్నంలోనూ తనిఖీలు జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Formula E Car Race Case : హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా-ఈ రేస్ ఒప్పందానికి ముందు గ్రీన్ కో సంస్థ ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో బీఆర్‌ఎస్ పార్టీకి రూ.41 కోట్ల వరకు ఇచ్చారనే అభియోగాలపై తెలంగాణ ఏసీబీ దృష్టి సారించింది. 2022 అక్టోబర్ 25న రేస్ నిర్వహణకు సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. అంతకు ముందు అదే ఏడాది ఏప్రిల్‌లో రూ.31 కోట్లు అక్టోబర్‌లో రూ.10 కోట్ల రూపాయలు గ్రీన్‌కో అనుబంధ సంస్థలు ఎలక్ట్రోరల్ బాండ్లను సమకూర్చడంపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఇందుకు సంబంధించిన ఫైళ్లు, ఇతర వివరాలు, అనుబంధ పత్రాలు వంటి వాటిని సేకరించేందుకు మచిలీపట్నం కార్యాలయంలో తనిఖీలు జరుపుతున్నారు.
కేటీఆర్‌కు ఈడీ పిలుపు - విచారణకు రావాలని నోటీసులు
ఫార్ములా ఈ కార్ రేసింగ్‌పై చర్చించే సత్తా ప్రభుత్వానికి లేదు: కేటీఆర్