Nutmeg Enhances Flavor of Biryani : చాలా మందికి ఘుమఘుమలాడే చికెన్ బిర్యానీ అంటే ఎంతో ఇష్టం. ఇంట్లో లేదా రెస్టారెంట్లో నెలకి రెండు మూడుసార్లు బిర్యానీ తినేవారు ఎక్కువమందే ఉన్నారు. అయితే, బిర్యానీ అంత రుచిగా ఉండడానికి అందులో వాడే లవంగాలు, యాలకులు వంటి మసాలా దినుసులే ప్రధాన కారణమని చాలా మంది అనుకుంటారు. కానీ, బిర్యానీ టేస్ట్ సీక్రెట్ వెనక మరో సుగంధ ద్రవ్యం కూడా ఉందని మీకు తెలుసా ?
మనం ఇంట్లో వంటల్లో ఎక్కువగా వాడే 'లవంగం' ఓ పూమొగ్గ. 'దాల్చినచెక్క' ఓ చెట్టు బెరడు. 'కుంకుమపువ్వు' పువ్వులోని కేసరం. ఇవన్నీ వివిధ చెట్టు లేదా మొక్క నుంచి వచ్చే వేర్వేరు సుగంధద్రవ్యాలు. అలాగే నాన్నెజ్ వంటల్లో ఉపయోగించే జాజికాయ, జాపత్రి కూడా విభిన్నమైన మసాలాద్రవ్యాలే. కానీ ఇక్కడ ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే రెండూ ఒకే చెట్టు నుంచి వస్తాయి. వేర్వేరు ఫ్లేవర్లున్న 2 మసాలాద్రవ్యాల్ని ఇచ్చే చెట్టు ప్రపంచంలో ఇదొక్కటే ఉందటే ఆశ్యర్యం కలగకుండా ఉండదు! అయితే, వీటిలోని ఔషధగుణాలను ఇప్పుడు చూద్దాం.
బిర్యానీ తయారీలో, కేకు మంచి ఫ్లేవర్‌గా ఉండడానికి, చికెన్ కర్రీలలో కాస్త జాజికాయ పొడీ, జాపత్రీ తప్పకుండా వేస్తారు. ఇక నాన్‌వెజ్ వంటల్లో మిరియాలు, లవంగాలు, యాలకలు, దాల్చిన చెక్క వంటి మిగతా మసాలాలతో పాటు జాజికాయా, జాపత్రీ వేస్తేనే ఆ వంటకాలు రుచిస్తాయి, గుబాళిస్తాయి.
రెండూ ఒకే చెట్టు నుంచి!
జాజికాయ- చిన్న సైజు యాపిల్‌లా ఉండే జాజిఫలంలోని గట్టి విత్తనం. జాపత్రి- చూడ్డానికి ఓ పువ్వులా ఉంటుంది. కానీ జాపత్రి, జాజికాయని ఓ లేసుపొరలా చుట్టుకుని ఉండే ఒక రకమైన సుగంధ ద్రవ్యం. అలాగని రెండింటి టేస్ట్ ఒకేలా ఉండదు. జాజికాయ మట్టి రుచితో కూడిన ఘాటైన తీపి వాసనతో ఉంటుంది. అలాగే జాపత్రి మిరియం ఘాటు కలిసిన తీపి రుచితో గుబాళిస్తుంది. ఇక్కడ దేని ఫ్లేవర్ దానిదే. అందుకే ఇవి రెండు రకాల మసాలాద్రవ్యాలుగా మనం వాడుతున్నాం. రెండింటినీ మసాలా వంటకాలతోపాటు, స్వీట్లూ బేకరీ ఉత్పత్తులూ సాసేజ్‌లూ పుడ్డింగుల తయారీలో ఉపయోగిస్తున్నారు. అలాగే వీటినుంచి తీసిన ఒకరకమైన గాఢతైలాన్నీ జాజికాయ నుంచి తీసిన వెన్ననీ పెర్‌ఫ్యూమ్స్, ఔషధాలు, కాస్మెటిక్స్ తయారీలోనూ వాడతున్నారు.
భారత్ రెండవ స్థానంలో!
జాజికాయ చెట్లు ఒకప్పుడు ఇండొనేషియాలోని బాండా దీవుల్లోనే కనిపించేవట! ఆ తర్వాత క్రమంగా మలేషియా, సింగపూర్, శ్రీలంకకు చేరింది. ఇప్పుడు జాజికాయను తమిళనాడు, కేరళ, కర్ణాటకలోనూ పండిస్తున్నారు. జాజికాయ సంబంధించి ప్రపంచ ఎగుమతుల్లో భారత్ రెండోస్థానంలో ఉంది.
వీటికింత డిమాండ్ ఎందుకంటే?
జాజికాయ, జాపత్రిలో ఖనిజాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లూ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లోని మిరిస్టిసిన్, మేస్‌లిగ్నన్ అనే పదార్థాలు శక్తిమంతమైనవనీ ఆధునిక, సంప్రదాయ నిపుణులు అంటున్నారు. ఆయుర్వేదంలో వాంతులు, డయేరియా, గ్యాస్, పొట్టనొప్పి సమస్యల చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ఇంకా నిద్రలేమి, మూత్రపిండ సమస్యలు, దగ్గు ఇలా ఎన్నో వ్యాధుల చికిత్సలో ఈ రెండింటినీ వాడుతున్నారు.
జాజికాయతో లాభాలు!
- జాజికాయ రక్తప్రసరణని మెరుగుపరుస్తుంది. అలాగే క్లోమగ్రంథి ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
- రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది.
- వృద్ధాప్య సమస్యల్ని నివారిస్తుంది.
- గుండె, కాలేయ, క్యాన్సర్ వ్యాధుల్ని అడ్డుకుంటుంది.
- పొట్టలోని చెడు బ్యాక్టీరియాను నశింపజేసి జీర్ణ సమస్యలు రాకుండా కాపాడుతుందని సంప్రదాయ వైద్యులు చెబుతున్నారు.
- ఇందులోని మిరిస్టిసిన్- మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది. అలాగే ఆల్జీమర్స్, డిప్రెషన్‌లను తగ్గిస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
- ఇంకా జాజికాయకు కీళ్లనొప్పులతోపాటు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించే సామర్థ్యం ఉంది!
- ఇది పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచి శుక్రకణాల వృద్ధికి తోడ్పడుతుంది.
- శీతాకాలంలో బద్ధకాన్ని తగ్గిస్తుంది.
- తలనొప్పిని మాత్రకన్నా ఇదే మంచి ఫలితం చూపిస్తుందని ఓ పరిశోధన తేల్చింది!
- రాత్రిపూట ఆహారంలోగానీ పాలల్లోగానీ చిటికెడు జాజికా పొడి వేసుకుంటే త్వరగా మంచి నిద్ర పడుతుంది.
జాపత్రితో లాభాలు అనేకం!
- ఎరుపు నుంచి నారింజ రంగులో దారపు పోగుల్లా ఉండే జాపత్రినే 'జావిత్రి' అని కూడా పిలుస్తారు.
- జలుబు, దగ్గు, ఫ్లూజ్వరాలు, ఆస్తమాకి కారణమైన వైరస్‌లతో పోరాడే గుణం జాపత్రిలో ఉంది. అందుకే దీన్ని ఆయా టానిక్కుల్లో వాడతారు.
- రక్తపోటుని తగ్గించడంతోపాటు గుండె ఆరోగ్యానికీ జాపత్రి ట్యాబ్లెట్‌లా పనిచేస్తుంది.
- కిడ్నీల్లోని రాళ్లను కరిగించే లక్షణం దీనికి ఉంది.
- ఇందులోని యూజెనాల్ పంటినొప్పికి మంచి ఔషధంలా పని చేస్తుంది.
- జాపత్రిలోని మేస్‌లిగ్నన్ నాడీకణాలను ప్రేరేపించడం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
- అందుకే ఈ రెండింటినీ పొడి రూపంలో తయారు చేసి సూప్‌లు, టీ కాఫీల్లో, పండ్లమీద చల్లుకునీ తినొచ్చు.
- ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి ఏ పొడి అయినా పావు లేదా అర టీస్పూనుకి మించకూడదు.
- మరీ ముఖ్యంగా జాజికాయ మోతాదు ఎక్కువైతే ఇది భ్రాంతులను కలిగిస్తుంది. కాబట్టి అన్నింటిలో జాగ్రత్త ఉపయోగించండి!
హైదరాబాద్ బిర్యానీనా మజాకానా? - న్యూ ఇయర్ వేళ అర కిలోమీటరు క్యూ!
చిట్టిముత్యాలతో స్పైసీ "మటన్ దమ్ బిర్యానీ"- ఇలా చేస్తే ఆ ఘుమఘుమలకే సగం కడుపు నిండిపోతుంది!