Aswaraopet SI Sriramula Srinu Suicide Update : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై ఆత్మహత్య ఘటన సంచలనం సృష్టించింది. గతనెల 30న మహబూబాబాద్‌లో పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఎస్సై శ్రీరాముల శ్రీను చికిత్స పొందుతూ మృతిచెందారు. తన భర్త మృతికి సీఐ జితేందర్‌రెడ్డి, కానిస్టేబుళ్లు శేఖర్, సన్యాసినాయుడు, సుభాని, శివనాగరాజులే కారణమని, ఎస్సై భార్య కృష్ణవేణి హైదరాబాద్ మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది.
చికిత్స పొందే సమయంలో శ్రీను, తనను వేధించిన తీరును కుటుంబసభ్యులతో పంచుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం చర్చనీయాంశమైంది. వారం కింద బలవన్మరణానికి యత్నించిన ఎస్సైని తొలుత వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. శ్రీను మరణవార్త తెలియగానే ఆయన మేనత్త, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లికి రాజమ్మ గుండెపోటుతో కన్నుమూశారు.
వరంగల్ జిల్లా నారక్కపేట గ్రామానికి చెందిన శ్రీను, 2014 బ్యాచ్‌కు చెందినవారు. తొలి పోస్టింగ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విధులు నిర్వహించారు. అనంతరం పలు స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తూ ఆర్నెల్ల కిందట అశ్వారావుపేటకు బదిలీపై వచ్చారు. మరో ఏడాది అయితే, ఆయనకు సీఐగా పదోన్నతి లభించనుంది. ఈ తరుణంలో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు.
మృతుడికి భార్య, కుమార్తె , కుమారుడు ఉన్నారు. అశ్వారావుపేట స్టేషన్ అధికారి -సీఐ, కానిస్టేబుళ్లు తనపట్ల అవమానకరంగా వ్యవహరించారని, కులం పేరుతో దూషించారని ఎస్సై శ్రీను తన వీడియో సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపించినా స్పందన లేదని తెలిపారు. ఇదే క్రమంలో వేరే చోటుకు బదిలీ చేయించుకునేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధిని శ్రీను కలిసినట్లు సమాచారం. ఆ ప్రక్రియ ఆలస్యమైన క్రమంలో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు.