Govt Conducting Re Survey On Musi River :హైదరాబాద్ మూసీ నది ప్రక్షాళనలో భాగంగా చేపట్టిన సర్వే స్వల్ప ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని మూసీ నది గర్భంలో ఉన్న నిర్మాణాలు, నివాసాలను తొలగించేందుకు మూడోరోజు ఆయా జిల్లాల రెవెన్యూ అధికారులు సర్వే కొనసాగించారు. నది గర్భంలో ఉన్న నిర్వాసితులకు నచ్చజెబుతూ మార్కింగ్ వేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో చైతన్యపురి డివిజన్ పరిధిలోని గణేష్‌నగర్, న్యూమారుతీ నగర్లో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అధికారులు ఇంటికి మార్క్ వేయడానికి రాగా ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.
సర్వే చేసేందుకు వచ్చిన అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కింగ్ చేయకుండా అడ్డుకున్నారు. నదికి సమీపంలోని నివాసాల వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారికి మద్దతుగా మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అక్కడికి చేరుకొని రోడ్డుపై బైఠాయించి సీఎంపై మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన పేరుతో రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
డీసీఎంలను అడ్డుకున్న మహిళలు :సాయిబాబా కాలనీలో రెవెన్యూ అధికారులు నిర్వాసితులను ఖాళీ చేయించేందుకు డీసీఎంలను తీసుకురాగా స్థానిక బీజేపీ నాయకులు, మహిళలు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానికుల్లో కొంతమంది డీసీఎంలను ధ్వంసం చేసేందుకు యత్నించగా డ్రైవర్లు అక్కడి నుంచి వాహనాలను బయటికి తీసుకెళ్లారు. రెవెన్యూ అధికారులపై కూడా స్థానికులు ఎదురుదాడికి దిగడంతో పోలీసులు జోక్యం చేసుకొని అధికారులను అక్కడి నుంచి పంపించారు.
బహదూర్‌పురా, లంగర్‌హౌస్‌లోనూ పెద్ద సంఖ్యలో మూసీ నది వాసులు ఆందోళనకు దిగారు. లంగర్‌హౌస్‌లో ఫిల్లర్ నెంబర్ 102 వద్ద ఆస్రంనగర్ కాలనీకి చెందిన సుమారు 100 మందికి పైగా రహదారిపై బైఠాయించడంతో రాజేంద్రనగర్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తమ నివాసాలు అన్యాయంగా కూల్చివేస్తున్నారని, ప్రభుత్వం తమ నిర్ణయం పట్ల పునరాలోచన చేయాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు కూడా వారిని అదుపు చేయలేకపోయారు. కాసేపటికి కాలనీవాసులే ఆందోళన విరమించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.