Telangana Govt Exercise for Crop Loan Waiver Scheme 2024 :రాష్ట్రంలో ఆగస్టు 15లోపు రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ అమలుకు విధివిధానాలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అర్హులైన వారికే రుణమాఫీ వర్తింపజేసేందుకు అధికారులు వివిధ ప్రతిపాదనలను సమర్పిస్తున్నారు. పాస్‌బుక్‌లు, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని తాజాగా వారు సర్కార్‌కు సూచనలు చేసినట్లు తెలిసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదాయపన్ను చెల్లించే వారు, ఉద్యోగులను దీని నుంచి మినహాయించాలని కేబినెట్ సమావేశ ఎజెండాలో ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
Officers New Proposal to Runa Mafi : పంట రుణాల మాఫీపై ఈ వారంలో సమావేశం నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించడంతో వ్యవసాయాధికారులు రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకున్న వారి జాబితాను బ్యాంకుల నుంచి తెప్పిస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఈ జాబితా అధికారుల వద్దకు చేరనుంది. ఈలోపే రుణమాఫీని ఎవరెవరికి అమలు చేయాలనే దానిపై వ్యవసాయశాఖ వివిధ ప్రామాణికాల ప్రాతిపదికన విస్తృతస్థాయిలో అధ్యయనం చేస్తోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
లబ్ధిదారులు ఎంతమంది : రైతుబంధు పథకం కింద తెలంగాణలో 66 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో రూ.2 లక్షల లోపు రుణాలు పొందినవారు దాదాపు ఇంత మందే ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు రైతుబంధు లబ్ధిదారుల్లో దాదాపు 6 లక్షల మందికి పట్టాదారు పాస్‌బుక్‌లు లేవు. వాటిని ప్రామాణికంగా తీసుకుంటే రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య 60 లక్షలకు తగ్గుతుందని అధికారులు అంటున్నారు.
మరోవైపు కుటుంబంలోని ఇద్దరు, ముగ్గురికి రైతుబంధు వస్తోంది. వారందరికీ రేషన్ కార్డుల్లేవు. కుటుంబ పెద్దకు మాత్రమే ఉంది. రేషన్‌కార్డు నిబంధన పెడితే కుటుంబంలో రైతుకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని, తద్వారా మరో 18 లక్షల మంది తగ్గే అవకాశం ఉందని అధికారులు నివేదిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపన్ను చెల్లింపుదారులు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మినహాయిస్తే మరో రెండు లక్షల మంది తగ్గుతారని అధికారులు అంటున్నారు.