NVS Reddy about Metro Rail : ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టే ప్రాజెక్టులకు ఎన్నో సవాళ్లు ఉన్నాయని, వాటిని పర్యవేక్షించే ప్రభుత్వ అధికారులకు నిర్ణీత పదవీకాలం ఉండాలని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యం అంశంపై ప్రసంగించిన ఆయన, నగరాల్లో ప్రభుత్వం చేసే ప్రాజెక్టులతో పోలిస్తే ప్రైవేటు సంస్థలు చేసేటప్పుడు చాలా సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. హైదరాబాద్ మెట్రో మొదటి దశలో 6వేల చెట్లు తొలగించామని, ఇందులో 2,350 చెట్లను వేరే చోట నాటామని చెప్పారు.
తొలగించిన ఒక చెట్టు స్థానంలో 5 మొక్కలు నాటాల్సి ఉండగా హెచ్ఎంఆర్ 12 లక్షల మొక్కలు నాటిందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అదే ప్రైవేటు అయితే ఒక చెట్టును కూడా తొలగించడం సాధ్యం అయ్యేది కాదన్నారు. అందుకే ఈ తరహా ప్రాజెక్టులను చూసే అధికారులకు నిర్ణీత పదవీ కాలం ఉండాలనేది తన అభిప్రాయమన్నారు. ప్రభుత్వంలో వేతనాలు, ప్రైవేటుతో పోలిస్తే తక్కువగా ఉంటాయని భారీ వేతనాలు ఊరిస్తుంటాయని, దీన్ని ఎలా ఎదుర్కోవాలనేది పీపీపీ ప్రాజెక్టుల్లో పెద్ద సవాల్ అన్నారు. రాజకీయ ఒత్తిళ్లు, అధికారుల్లో అవినీతి వంటి ఎన్నో సవాళ్లు ఉన్నాయన్నారు.
'నిర్దిష్టమైన సమయానికల్లా ప్రజలను తమ గమ్యస్థానాలను చేర్చేందుకు ఎన్నో సవాళ్లనుఎదుర్కొన్నా.పెరిగిన ట్రాఫిక్ రద్దీతో ప్రయాణికులు ఎంతో ఇబ్బందిపడ్డారు, మెట్రో వల్ల నేడు నగరం మొత్తం 60 నిమిషాల్లో చుట్టేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం వల్లే ఇది సాధ్యమైంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో అభివృద్ధి రోజురోజుకు విస్తరిస్తోంది' - ఎన్వీఎస్ రెడ్డి, మెట్రోరైలు ఎండీ