పూర్తికాని నర్సింగ్ నూతన కళాశాల భవనం - ఇబ్బంది పడుతున్న విద్యార్థులు (ETV Bharat) Nursing Students Problems In Nizamabad: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఏకైక ప్రభుత్వ నర్సింగ్ కళాశాల బాన్సువాడకు మంజూరైంది. ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సభాపతిగా ఉన్న సమయంలో నాటి సీఎం కేసీఆర్తో ప్రత్యేకంగా మాట్లాడి 2021లో ఈ కళాశాల మంజూరు చేయించారు. దీంతో పాటు రూ.40 కోట్ల నిధులతో నూతన కళాశాల, వసతి గృహ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు.
అదే విద్యా సంవత్సరం 100 మంది విద్యార్థులతో బాన్సువాడ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి భవనం పైభాగంలో కళాశాల ప్రారంభించారు. మొదటి సంవత్సరం తక్కువ మంది విద్యార్థులు కావడంతో వారూ సర్దుకున్నారు. కళాశాల భవన నిర్మాణం కోసం ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో స్థలం కేటాయించారు. 2022లో భవనం పనులు ప్రారంభించారు. రెండేళ్లుగా పనులు సాగుతున్నా ఇప్పటికీ పూర్తికాలేదు. శాశ్వత భవనం లేకపోవడంతో చదువుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థినిలు చెబుతున్నారు.
Telangana University Sports Board Problems : స్పోర్ట్ బోర్డు ఓకే.. మరి వసతులేవి.. నిధులేవి..?
నర్సింగ్ కళాశాలలో ప్రతీ ఏడాది 100 మంది విద్యార్థులు చేరుతుంటారు. ఇప్పటికే మూడు విద్యా సంవత్సరాలు కావడంతో 300 మంది విద్యార్థులు వివిధ జిల్లాల నుంచి వచ్చి చదువుకుంటున్నారని కళాశాల ప్రిన్సిపల్ భూలక్ష్మి అన్నారు. ఈ విద్యా సంవత్సరం మరో 100 మంది విద్యార్థులు రానున్నారు. మొదటి, రెండో ఏడాది మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలోని భవనంలో చదువు చెబుతూ అధ్యాపకులు నెట్టుకొచ్చారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఈ విద్యా సంవత్సరం మరింత ఇబ్బందిగా మారనుందని ఆమె అన్నారు. నూతన భవన నిర్మాణం పూర్తైతే తప్ప ఈ ఇబ్బందులు తీరవని కళాశాల ప్రిన్సిపల్ చెబుతున్నారు. అధికారులు చొరవ తీసుకొని కళాశాల, వసతి గృహ భవనాల పనులు త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.
"రెండేళ్లుగా పనులు సాగుతున్నా కొత్త భవనం పనులు పూర్తికాలేదు. పాత బిల్టింగ్లో చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది. టీచర్ల కొరత ఉంది. సిలబస్ కోసం ఉన్న టీచర్లే ఎక్కువ సమయం తీసుకొని చెబుతున్నారు. కొత్త బిల్డింగ్ పూర్తయితే కష్టాలు పోతాయి. అధికారులు చొరవ తీసుకొని కళాశాల, వసతి గృహ భవనాల పనులు త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి." - నర్సింగ్ విద్యార్థినులు
చదువులమ్మ ఒడిలో సమస్యల వ్యథ - విద్యార్థులను వెంటాడుతున్న వసతుల లేమి!
అధ్వాన్నంగా కళాశాల - వసతుల్లేక విద్యార్థులు విలవిల - ఇలా అయితే చదువులు సాగేదెలా!