NTR Cultural Association 55 Years Celebrations :నందమూరి తారక రామారావు అంటే జాతీయవాదం, తెలుగు, రసస్ఫూర్తి కలయిక అని ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహరావు కొనియాడారు. ఆయనకు దైవభక్తి ఎంత ఉందో దేశభక్తి అంతే ఉందన్నారు. అలాంటి నటుడిని మనం మళ్లీ చూడలేమని గరికపాటి తెలిపారు. పాలకుడిగా పథకాలకు తెలుగుపేరు పెట్టిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని గరికపాటి నరసింహరావు ప్రశంసించారు. ఎలాంటి పాత్రలోనైనా రసస్ఫూర్తిని ప్రదర్శించిన ఏకైక నటుడని గరికపాటి నరసింహరావు కొనియాడారు. గుంటూరులో నిర్వహించిన ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ 55 వసంతాల వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు, సినీ నిర్మాత అశ్వినీదత్, దర్శకుడు వైవీఎస్ చౌదరి హాజరయ్యారు.
మహిళలకు ఆస్తి కల్చించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని సభాపతి అయ్యన్నపాత్రుడు కొనియాడారు. తాను 25 సంవత్సరాలకే ఎమ్మెల్యే కావడానికి ఎన్టీఆరే కారణమన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారంటే ఎంతోమంది విమర్శించారన్నారు. కానీ, ఆయన రాజకీయాల్లో రాణిస్తారని 25 సంవత్సరాల వయసులోనే తాను నమ్మానని స్పీకర్ అయ్యన్నపాత్రుడు గుర్తు చేశారు. నాకు రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్. చిన్న వయసులోనే మంత్రిని అయ్యే అవకాశమిచ్చారని కొనియాడారు. కుటుంబ విలువలు చాటి చెబుతూ అనేక సినిమాలు తీశారని ప్రశంసించారు. మహిళలంటే ఆయనకు ఎంతో గౌరవమని అయ్యన్న పేర్కొన్నారు. మహిళలకు ఆస్తి హక్కు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.