Car into Well One Person Died and One Injured: రోడ్డుపై వెళ్తున్న కారు టైరు పేలి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి కారు దూసుకుపోయింది. ఈ ఘటన అనంతపురం జిల్లా నార్పల మండలం నడిమి దొడ్డి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. బావిలో ఎక్కువ మొత్తంలో నీరు ఉండటంతో కారు మునిగిపోయింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలతో బయటపడ్డారు.
సీఐ కౌలుట్లయ్య తెలిపిన వివరాల ప్రకారం, తాడిపత్రి నుండి నార్పల వైపు వెళుతున్న కారుకి ఆవు అడ్డు రావడంతో తప్పించబోయి టైరు పేలి పక్కనే ఉన్న బావిలోకి పడిపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణం చేస్తున్న అనంతపురానికి చెందిన షాబుద్దీన్ (40) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఇర్ఫాన్ అనే మరో వ్యక్తికి గాయాలయ్యాయి. మృతుడు షాబుద్దీన్ అనంతపురం గుల్జార్ పేటకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.
మృతి చెందిన షాబుద్దీన్కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న వారు ఇద్దరూ జియో కంపెనీలో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఘటన స్థలానికి నార్పల, సింగనమల పోలీసులు చేరుకొని స్థానికుల సహకారంతో బావిలో పడ్డ మరొక వ్యక్తిని తాళ్ల సహాయంతో బయటికి తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.