Software Engineer Murdered Due To Extra marital Affair In Vizianagaram : విజయనగరం జిల్లా తెర్లాం మండలం నెమలాంలో మూడు రోజుల క్రితం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రసాద్ దారుణ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానమే అతడి ప్రాణాలు తీసిందని పోలీసుల విచారణలో తేలింది. తన వదినతో సన్నిహితంగా ఉంటున్నాడని అనుమానంతో ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. తన వదిన నుంచి మృతుడ్ని దూరం చేయాలని మరిది పథకం ప్రకారం అన్నతో కలిసి ఈ హత్య చేసినట్లు తెలిసింది. దర్యాప్తు అనంతరం పోలీసు అధికారులు ఈ కేసు మిస్టరీని త్వరలో ఛేదించనున్నారు.
స్థానికుల సమాచారం ప్రకారం ఒకే గ్రామం, దూరపు బంధుత్వం వల్ల ప్రసాద్ సదరు వివాహితతో సన్నిహితంగా ఉండటాన్ని ఆమె మరిది తట్టుకోలేకపోయాడు. భర్త అమాయకుడైనా మరిది ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఆమె సెల్‌ఫోన్‌కు ప్రసాద్ పంపిస్తున్న సంక్షిప్త సందేశాలను వాట్సాప్ వెబ్ ద్వారా ల్యాప్‌టాప్‌లో మహిళ మరిది చూసేవాడు. ఆమె బెంగళూరు వస్తానంటే అక్కడే తనకోసం ఉద్యోగం చూస్తానని ప్రసాద్ ఆమెకు పంపిన సందేశం చూసి మరింత రగిలిపోయాడు.
వీడియో కాల్ చేసి అతడు ఉరేసుకున్నాడు - ఆపై ఆమె కూడా!
తెర వెనుక ఈ వ్యవహారాన్ని అన్నకు నూరిపోసి ప్రసాద్‌ను హతమార్చేందుకు పథకం రచించాడు. బెంగళూరు నుంచి పెళ్లి చూపులకు వచ్చిన ప్రసాద్ సోమవారం పొరుగూరులోని తాతగారింటికి వెళ్లడం చూశారు. రాత్రి ఫోన్ చేసి నెమలాం సమీపానికి రప్పించారు. మార్గమధ్యలో మాటేసి తొలుత కర్రతో కొట్టారు. ఆ తర్వాత బండరాయికి ప్రసాద్ తల కొట్టి ఊపిరి తీశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు అందరూ భావించాలని మృతదేహాన్ని రోడ్డుపై పడేశారు. ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేసి ఓ పక్కకు పడేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఇంటికి చేరుకున్నారు.
పోలీసుల అదుపులో అన్నదమ్ములు? : ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు అనుమానితులైన ఇద్దరు అన్నదమ్ములను అదుపులోకి తీసుకున్నారని, నేరాన్ని వారు అంగీకరించారని తెలిసింది. ప్రసాద్ చరవాణిని నేలబావిలో విసిరేసినట్లు నిందితులు ఇచ్చిన సమాచారంతో గురువారం పోలీసులు నీటిని తోడించారు. చరవాణిని స్వాధీనం చేసుకున్నారు. ఒకటి, రెండ్రోజుల్లో మిస్టరీ వీడనుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు.