Essential Prices Increase in Telangana : మన రాష్ట్రంలో సగటు వ్యక్తి జీవనం రోజురోజుకూ మరింత భారంగా మారుతోంది. దేశంలోని ప్రధాన రాష్ట్రాలో పోలిస్తే మన రాష్ట్రంలో నిత్యావసర సరుకులు, వైద్య ఖర్చులు బాగా పెరిగాయి. వాస్తవానికి ధరల జాతీయ సగటు దాదాపు వంద శాతం పెరిగినట్లు కనిపిస్తున్నా ప్రాంతాలవారీగా విడివిడిగా చూస్తే కొన్నిచోట్ల దాదాపు 200 శాతం పెరిగినవి కూడా ఉన్నాయి.
ఏమిటీ నివేదిక : ఎన్‌ఎస్‌ఎస్‌వో సంస్థకు చెందిన క్షేత్రస్థాయి సిబ్బంది దేశవ్యాప్తంగా 1,114 పట్టణ మార్కెట్లు, మరో 1,181 గ్రామాల నుంచి సేకరించిన ధరల వివరాలతో ‘వినియోగదారుల ధరల సూచిక’ (కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్-సీపీఐ), ‘వినియోగదారుల ఆహార ధరల సూచిక’ (కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్-సీఎఫ్‌పీఐ) 2024 ఆగస్టు నివేదికను విడుదల చేసింది. కీలకమైన నిత్యావసర సరకుల ధరల్లో పెరుగుదల తీరును సరకులవారీగా, రాష్ట్రాలవారీగా కేంద్రం నివేదికలో వివరించింది.
కూరగాయలు, పప్పుల ధరలు పైపైకి :2023 ఆగస్టుతో పోలిస్తే 2024 ఆగస్టులో దేశంలో మాంసం, చేపలు, సుగంధ ద్రవ్యాల ధరల ద్రవ్యోల్బణం తగ్గినట్లు ఇందులో తెలిపింది. ఆహార ధరల సూచిక జాతీయ సగటు ఏడాది వ్యవధిలో 192.5 నుంచి 203.4కు పెరిగింది. దేశంలో అన్ని నిత్యావసరాలను పరిశీలిస్తే కూరగాయల ధరల సూచిక జాతీయ సగటు అత్యధికంగా 260.6కి చేరింది. గత ఏడాదితో పోలిస్తే కూరగాయల ధరల ద్రవ్యోల్బణం 10.71 శాతం, పప్పులు, వాటి ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 13.60 శాతం పెరగడం గమనార్హం. అన్ని రకాల నిత్యావసరాల ద్రవ్యోల్బణం 3.65 శాతం ఉందంటే ఇవి ఏ స్థాయిలో పెరిగాయో అర్థం చేసుకోవచ్చు.
ఇక్కడ సారవంతమైన భూములున్నా :రాష్ట్రాలవారీగా సాధారణ వినియోగదారుల ధరల సూచిక(సీపీఐ) 2024 జులై, ఆగస్టు మధ్య ఎలా పెరిగిందో కేంద్రం వివరించింది. ఉదాహరణకు సీపీఐ 2012లో 100 పాయింట్లు ఉండగా, 2024 ఆగస్టులో ఎంతకు చేరిందో రాష్ట్రాలవారీగా వెల్లడించింది. 2012-24 మధ్యకాలంలో జాతీయ సగటు 100 నుంచి 193 పాయింట్లకు పెరిగింది. త్రిపుర 215, మణిపుర్ 213.4, తెలంగాణ 201.6 పాయింట్లతో తొలి 3 స్థానాల్లో నిలిచాయి.
మణిపుర్, త్రిపురలు దేశ ఈశాన్య ప్రాంతంలో మారుమూలన ఉన్నందువల్ల రవాణా ఛార్జీలు అధికమై నిత్యావసరాల ధరలు ఎక్కువగా ఉండటం సహజం. కానీ, సారవంతమైన భూములు, సమృద్ధిగా వనరులు ఉన్న తెలంగాణ 201.6 సీపీఐతో ప్రధాన రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉండటం ఇక్కడ నిత్యావసరాల ధరల పెరుగుదలకు అద్దం పడుతోంది.