Hyderabad Regional Ring Road New Updates : రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు హైదరాబాద్ ప్రాంతీయ రింగు రోడ్డు. ఈసారి ఈ ఆర్‌ఆర్‌ఆర్ రెండు భాగాలను ఒకేసారి నిర్మించడానికి అడుగులు ముందుకు పడుతున్నాయి. అయితే కేంద్రం ప్రభుత్వం చేసిన సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలోనే పనులు చేపట్టేందుకు సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపింది. ఈ మేరకు దిల్లీలో ఇటీవల జరిగిన సమీక్షలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేసిన సూచనలకు సీఎం రేవంత్ రెడ్డి సుముఖత వ్యక్తం చేయడంతో పాటు రాష్ట్ర అధికారులకు ఆయా అంశాలపై దృష్టి సారించాలని సూచించినట్లు తెలుస్తోంది.
ఆర్‌ఆర్‌ఆర్‌ను ఉత్తర, దక్షిణ భాగాలు కలిపి 350.79 కిలోమీటర్ల మేరకు నిర్మించనున్నారు. సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, భువనగిరి, చౌటుప్పల్ వరకు ఉత్తర భాగానికి సంబంధించి 161.59 కిలోమీటర్ల భాగానికి కేంద్రం నాలుగేళ్ల కింద జాతీయ రహదారి హోదాను ఇచ్చింది. ఇందుకు 4,750 ఎకరాల వరకు భూసేకరణ చేసి నిర్మించాల్సి ఉందని తెలిపింది. ఈ ప్రక్రియ ప్రస్తుతం కీలక దశలో ఉంది. ఒకట్రెండు ప్రాంతాలకు సంబంధించి న్యాయస్థానంలో వ్యాజ్యాలు నమోదవగా మిగిలిన ప్రాంతాల్లో తుది దశకు చేరుకుంది. వచ్చే జులై నెలలో భూముల యజమానులకు చివరి నోటీసులు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లును చేస్తున్నారు. అదే సమయంలో కోర్టులో ఉన్న కేసులను పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
దక్షిణ భాగం ఎలైన్‌మెంట్‌కు సూత్రప్రాయ ఆమోదం :ఇక దక్షిణ భాగంలో భాగంగా చౌటుప్పల్, ఆమల్‌గల్, షాద్‌నగర్, చేవెళ్ల, సంగారెడ్డి మీదుగా 189.20 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు. దీనికి జాతీయ రహదారి హోదాను సూచించే తాత్కాలిక నంబరును త్వరలో కేటాయించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఆయా ప్రతిపాదనలను అధికారులు రూపొందిస్తున్నట్లు సమాచారం. దక్షిణ భాగం ఎలైన్‌మెంట్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపాయి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇంకా వెలువడాల్సి ఉంది. అందుకు సంబంధించి ప్రక్రియను కూడా త్వరలో పూర్తి చేసేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది.