No Facilities in Jurala Project :కర్ణాటక నుంచి తెలంగాణలోకి ప్రవేశించే కృష్ణానది ప్రవాహానికి అడ్డుకట్ట వేసి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీరు, తాగునీరు అందించే మొదటి నీటి పారుదల ప్రాజెక్టు జూరాల. జూలైలో మొదలుకుని సెప్టెంబర్ వరకూ జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. జూరాల నిండినప్పుడు, గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినప్పుడు అక్కడకు సందర్శకులు పోటెత్తుతారు.
పర్యాటకులకు తప్పని ఇక్కట్లు : కృష్ణమ్మ జలపరవళ్లను తిలకించేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లా సహా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది జూరాలకు వచ్చి వెళ్తుంటారు. అక్కడి ప్రకృతి అందాలను చూస్తూ సేద తీరుతారు. కానీ అక్కడ కనీస వసతులు కూడా ఉండవు. వాహనాలు నిలిపేందుకు పార్కింగ్, తాగేందుకు నీళ్లు, తినేందుకు తిండి, సేద తీరేందుకు ఎలాంటి ఏర్పాట్లు ఉండవు. ప్రాజెక్టు చుట్టుపక్కల చెట్ల కిందో, పుట్ట కిందో కూర్చుని, అక్కడి మత్సకారులు వండి పెట్టే ఆహారాన్ని కొనుగోలు చేసి తిని తిరుగు ప్రయాణమవుతుంటారు. ఆహ్లాదం కోసం ఉద్యానవనాలు, పిల్లలు ఆడునేందుకు ఆట స్థలాలు ఇలాంటివి ఏవీ అక్కడ కనిపించవు. దీంతో పర్యాటకులు ఇబ్బందులకు గురవుతున్నారు.
గతంలో పార్కు నిర్మాణానికి రూ.15 కోట్లు మంజూరు : జూరాల వద్ద పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి పార్కు నిర్మాణం కోసం 2020 అక్టోబర్‌లో రూ,15కోట్లు మంజూరు చేశారు. పర్యాటక శాఖ అధ్వర్యంలో పార్కు పనులు ప్రారంభమై 80శాతం వరకూ పూర్తయ్యాయి. ప్రధాన ద్వారం, వంతెన, దుకాణ సముదాయాలు, ఫుడ్‌కోర్ట్, ఆంఫీ థియేటర్, ఫౌంటెన్, పిల్లలకు ఆటస్థలం, శిల్పాలతో కూడిన ఉద్యానవనం, నవగ్రహవనం, మేజ్ గార్డెన్‌కు సంబంధించి నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి.
పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం- అందాలు చూడతరమా! - Bogatha Waterfalls Mulugu