తెలంగాణ

telangana

ETV Bharat / state

అవస్థల నిలయంగా ఆదిలాబాద్‌ ఐటీఐ కళాశాల - అధ్యాపకులు లేక నిలిచిపోయిన బోధన - ITI Faculty Shortage in Adilabad

Faculty Shortage in ITI College : ఒకవైపు నియోజకవర్గానికి ఐటీఐను ఏర్పాటు చేసి యువత ఉపాధికి బాటలు వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెబుతుంటే మరోవైపు బోధకుల ఖాళీలు, సౌకర్యాల లేమితో ప్రస్తుత ఐటీఐ కళాశాలలు తమ ప్రభావాన్ని కోల్పోతున్నాయి. ఇందుకు ఆదిలాబాద్‌ జిల్లా ఐటీఐ కళాశాలే నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడ పనిచేస్తున్న బోధకులంతా వేతనాలు రాక మూకుమ్మడి సెలవు పెట్టడంతో విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడుతోంది.

Faculty Shortage in ITI College in Adilabad
Faculty Shortage in ITI College (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 27, 2024, 2:22 PM IST

Updated : Sep 28, 2024, 11:25 AM IST

Faculty Shortage in ITI College in Adilabad : ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాల ఇది. స్వయం ఉపాధితో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం పొందేలా ఇక్కడ 6 ట్రేడ్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రీషియన్‌, డీఎం సివిల్‌, వెల్డర్‌, డ్రెస్‌ మేకింగ్ స్టెనో, కోపా ట్రేడ్‌లలో 165 మంది విద్యార్థులు ఉన్నారు. గతంలో రెగ్యులర్‌ బోధకులు, అతిథి అధ్యాపకులు పనిచేసినా బదిలీల్లో కొందరు, పదవీ విరమణతో ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం 8 పోస్టులకుగాను ప్రిన్సిపల్‌ ఒకరు పనిచేస్తుండగా ఆయన అనారోగ్యంతో సెలవు పెట్టారు. ఉట్నూరు ప్రిన్సిపల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

ట్రైనింగ్‌ ఆఫీసర్‌తో సహా 6 డిప్యూటీ ట్రైనింగ్‌ ఆఫీసర్​ పోస్టులు ఏళ్లుగా ఖాళీగా ఉన్నాయి. అయితే ఇండస్ట్రీయల్‌ మేనేజ్‌మెంట్​ కమిటీ కింద ముగ్గురిని ఒప్పంద ప్రాతిపదికన నియమించగా 7 నెలలుగా వారికి వేతనాలు అందకపోగా మరో అతిథి అధ్యాపకుడికి ఏడాదిన్నరగా వేతనం రావడంలేదు. విసుగు చెందిన వారంతా వారం రోజుల కిందట మూకుమ్మడి సెలవు పెట్టారు. ఫలితంగా విద్యార్థులు తరగతి గదులకు వచ్చి వెళ్లిపోతున్నారు. బోధకులు లేక కంప్యూటర్‌ గదికి తాళం వేసి ఉంచుతున్నారు. మరికొన్ని ట్రేడ్‌ల గదులు తెరవడంలేదు. అధ్యాపకులు లేకపోవడంతో పాటు భవనం కూడా పగుళ్లు తేలి ఎప్పుడూ కూలుతుందోననే భయం వేస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

'ఐటీఐ చేస్తే మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఈ కళాశాలలో చేరాం. కానీ అధ్యాపకులు మాత్రం రావడంలేదు. రోజు కాలేజీకి వస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటున్నాం. కానీ క్లాసులు జరగడం లేదు'- విద్యార్థులు

మూకుమ్మడి సెలవులు పెట్టిన అధ్యాపకులు : బోధకుల మూకుమ్మడి సెలవు విషయమై తాత్కాలిక చర్యలు తీసుకున్న అధికారులు ఉట్నూరు ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్‌కు ఇన్‌ఛార్జి బాధ్యతలతో పాటు అక్కడ పనిచేస్తున్న ఇద్దరు బోధకులను సర్దుబాటు చేశారు. డ్రెస్‌మేకింగ్‌, ఎలక్ట్రీషియన్‌ ట్రేడ్‌ల విద్యార్థులకు పాఠాలు చెబుతున్నా మిగిలిన ట్రేడ్‌ల వారు మాత్రం బోధకులు లేక చాలామంది కళాశాలకు రావడం మానేశారు.

మూకుమ్మడి సెలవు పెట్టిన బోధకుల వేతనాల విషయమై ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చామని, త్వరలో వారు విధుల్లో చేరేలా చూస్తామని ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ చెబుతున్నారు. అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్‌ల పేరిట కోట్ల రూపాయలు వెచ్చించి భవనాలు నిర్మిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రవ్యాప్తంగా ఐటీఐల్లో ఉన్న 640 ఖాళీలను భర్తీ చేసేదిశగా చర్యలు తీసుకుంటే ఇప్పుడున్న విద్యార్థులకు మెరుగైన శిక్షణ అంది ఉపాధి లభించే అవకాశముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఉపాధికి రాచబాట- విద్యార్థులకు వరంగా మారిన ఐటీఐ కోర్సులు - employment through ITI course

టెక్నికల్​ కోర్సుల్లో చేరండి - తక్కువకాలంలో ఎక్కువ ఉపాధి అవకాశాలు పొందండి! - Technical Courses After 12th

Last Updated : Sep 28, 2024, 11:25 AM IST

ABOUT THE AUTHOR

...view details