Nizam Sagar Canal Embankment Broken in Armoor :నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని నిజాంసాగర్ కెనాల్ కట్ట తెగిపోవడంతో పక్కనే ఉన్న కాలనీలోని ఇండ్లలోకి నీరు చేరింది. ఒక్కసారిగా తెల్లవారుజామున కెనాల్ కట్ట తెగిపోవడంతో నిద్రలో ఉన్న స్థానిక కాలనీల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఎగువ ప్రాంతంలో కాలనీల్లోని మురికి నీరు కూడా నిజాం సాగర్ కెనాల్లో వచ్చి చేరుతుంది. కెనాల్ కట్ట ఒక్కసారిగా తెగి, నీటి ప్రవాహం ఇండ్లలోకి రావడంతో కాలనీవాసులు బయటకు పరుగులు తీశారు.
"అర్ధరాత్రి 3 గంటలకు ఇంట్లోకి నీరు వచ్చింది. కెనాల్లోకి ఎక్కువ నీరు వదిలారు. అందుకే కట్ట తెగింది. ఇళ్లలో చిన్నపిల్లలు ఉన్నారు. ఆ రాత్రి మేము వారిని పట్టుకుని ఎటు పోవాలి. నిండు గర్భిణీతో పాటు చిన్న అబ్బాయి ఉన్నారు. వారికి ఏదైనా అయితే ఎవరు బాధ్యులు. రాత్రి నుంచి ఫోన్ చేస్తుంటే పొద్దున వచ్చి చర్యలు చేపట్టారు. మా సామగ్రి అంతా నీళ్లలో పోయాయి. మాకు ఇలా ఉంటే ఎప్పటికైనా నష్టమే. మాకు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలి. ఇళ్ల నిర్మాణాలు కూడా చేయాలి." - కాలనీ వాసులు