Pushpa 2 Benefit Show Issue : పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఎన్హెచ్ఆర్సీకి న్యాయవాది రవికుమార్ ఫిర్యాదు చేశారు. పోలీస్ యాక్ట్ కింద ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా ప్రీమియర్ షో ఏర్పాటు చేశారని అందులో పేర్కొన్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్, సంబంధిత ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాది ఫిర్యాదును ఎన్హెచ్ఆర్సీ విచారణకు స్వీకరించింది.
సంధ్య థియేటర్ యాజమాన్యం భద్రతా ఏర్పాట్లు పాటించకపోవడంతో పాటు రద్దీని నియంత్రించలేకపోయిందని ఆ ఫిర్యాదులో తెలిపారు. దీంతో ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో పాటు ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వివరించారు. ఈ క్రమంలోనే మృతురాలి కుటుంబ సభ్యులకు రూ.5 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే మహిళ మృతి చెందారని తెలిపారు. నటుడు అల్లు అర్జున్తో పాటు సంబంధిత ప్రభుత్వ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని న్యాయవాది రవికుమార్ ఫిర్యాదులో కోరారు.
అసలేం జరిగింది :ఈనెల 4వ తేదీ రాత్రి 9.30 గంటల సమయంలో హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న సంధ్య థియేటర్లో పుష్ప -2 బెనిఫిట్ షోను చూసేందుకు దిల్సుఖ్నగర్కు చెందిన ఓ కుటుంబం వెళ్లింది. బెనిఫిట్ షో సందర్భంగా హీరో అల్లు అర్జున్ సినిమాను వీక్షించేందుకు థియేటర్ వద్దకు చేరుకున్నాడు. దీంతో తమ అభిమాన హీరోను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ క్రమంలో ఒక్కసారిగా అక్కడ తోపులాట జరిగింది.